calender_icon.png 13 July, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు: మంత్రి పొన్నం

12-07-2025 04:57:00 PM

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పొరపాటుగా ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నమని రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. శనివారం మంత్రి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy)తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్(Automated Testing Station) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్  ఉపయోగపడుతుందని అన్నారు. మనిషికి జబ్బు చేసినప్పుడు సీటీ స్కాన్ తీసిన విధంగానే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో సాంకేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాలలో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికి వస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుందని తెలిపారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటి 8 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారధి పరిధిలోకి వచ్చే విధంగా తెలంగాణను వాహన సారధిలో భాగస్వామ్యం చేశామని, ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపుల నిర్వహణ, పాఠశాలల్లో విద్యార్థులకు క్లబ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లను  ఆటోమేటిక్ గా నిర్వహించి ఆ టెస్ట్ లో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాశ్చాత్య దేశాల మాదిరిగానే తెలంగాణలో సైతం ఎవరైనా నిబంధనలు  అతిక్రమించితే జరిమానా విధించడమే కాకుండా, పొరపాటున వాహన ప్రమాదం చేసినట్లయితే అవసరమైతే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. 

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వలన 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ,నల్గొండ జిల్లాకు 70 ఈ బస్సులు ఇవ్వగా, 10 బస్సులు నార్కెట్ పల్లికి,తక్కినవి ఇతర ప్రాంతాలకు  తిప్పనున్నట్లు వెల్లడించారు. నార్కెట్ పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, అలాగే నార్కెట్పల్లి కి నూతన డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. వాహనాల ఫిట్నెస్ సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదాల నివారణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్  ఏర్పాటు చేయడం సంతోషమని, జిల్లా యంత్రాంగం తరఫున ఏటీసికి అవసరమైన సహకారం ఇస్తామని తెలిపారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీవాణి మాట్లాడుతూ.. మాన్యువల్ గా కాకుండా మిషన్ ద్వారా వాహనాలను పరీక్షించే అవకాశం ఏటిసి ద్వారా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రవాణా శాఖ కమిషన్ చంద్రశేఖర్, విశ్రాంత ఆర్టీవో మోహన్ రెడ్డి ,ఆర్టిఓ మెంబర్లు రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.