08-07-2025 07:27:15 PM
ఐకెపి ఎపిఎం లలిత కుమారి..
మందమర్రి (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించి ఆర్థికంగా అభివృద్ధి పథంలో తీసుకువచ్చేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని ఇందిరా క్రాంతి పదం ఏపియం ఎన్ లలిత కుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మహిళా సంఘాల సభ్యులనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లోని మహిళలను గుర్తించి మహిళా పొదుపు సంఘాలలో చేర్పించడం వారికి రుణాలు ఇప్పించడంతో పాటు, వృద్ధ, వికలాంగుల సంఘాల ఏర్పాటు చేయడమే కాకుండా 15 నుండి 18 సంవత్సరాల పైబడిన కిషోర బాలికలను సంఘాలలో చేర్పించేలా మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు స్త్రీనిది ద్వారా బ్యాంకు లింకేజి రుణాలు అందించి వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, రుణ బీమా, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, చేపల పెంపకం, పాల డైరీలు, వంటివి ఏర్పాటు చేసి వ్యాపార రంగంలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ పథకాలను మహిళా సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసి లు మోహన్, చారి, సునీత, మండల సమాఖ్య, గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.