26-12-2025 12:00:00 AM
ఆదర్శంగా నిలుస్తున్న వనిత సంతోష్ దంపతులు
బెజ్జూర్, డిసెంబర్ 25(విజయ క్రాంతి): ఎన్నికలవేళ నాయకులు , రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చి గెలుపొందిన తర్వాత వాటిని విస్మరించడం చూస్తున్న ఈ కాలంలో ఎన్నికల బరిలో ఓటమి చెందిన హామీని నిలబెట్టుకున్న సంఘటనతో అంద రి మన్ననలు పొందుతున్నారు కడంబ సర్పంచ్ అభ్యర్థి దండిక వనిత. ఆసిఫాబాద్ జిల్లా లో మూడో విడతలో జరిగిన ఎన్నికల బరిలో కడంబా గ్రామపంచాయతీ సర్పంచ్ గా వనిత పోటీ చేసింది.
ఈ క్రమంలో గ్రామంలోని రెండు కాలనీలలో తాగునీటి సమస్య ఉండడంతో తను గెలిచిన, ఓటమి చెందిన తాగునీటి సమస్య తీరుస్తానని ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. అనివార్య కారణాలవల్ల వనిత ఓటమి చెందింది. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రెండు బోరింగ్ ల నిర్మాణాన్ని గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దీంతోపాటు ప్రచారంలో తనని గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి 50 కేజీల బియ్యం, అబ్బాయి పెళ్లికి వెండి ఉంగరం ఇస్తానని సైతం ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోకుండా బోరింగ్ వేయించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చి హామీలు గుప్పించి గెలిచిన అనంతరం వాటి ని పట్టించుకోని ఈ రోజుల్లో తను ఇచ్చిన హామీ ప్రకారం తాగునీటి సమస్యను పరిష్కరించడంతో ఇలాంటి నాయకులను ఎందు కు గెలిపించలేదని గ్రామంలో చర్చ జరుగుతుంది. సొంత డబ్బులతో సేవ చేయ డం అభినందనీయమని గ్రామ ప్రజలు వనిత దంపతులను ప్రశంసిస్తున్నారు.