16-09-2025 12:55:54 AM
ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టేందుకు చర్యలు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
మంచిర్యాల, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపట్టిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు స్టాపేజీని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి, డి.ఆర్.ఎం. గోపాలకృష్ణన్, రఘు, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టులను తలపించేలా తీర్చిది ద్దడం జరుగుతుందని, మంచిర్యాలలో రూ. 26 కోట్లతో అమృత్ భారత్ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. 2019లో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 150 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించడం జరిగిందని, ఒక్కొక ్క ట్రైన్ విలువ రూ. 130 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్లను నడిపించడం జరుగుతుందని తెలిపారు. హైదరా బాద్ నుండి పూణే, హైదరాబాద్ నుండి నాందేడ్‌కు వందే భారత్ ఏర్పాటుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు.
2014 ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి రూ. 258 కోట్లు కేటాయించడం జరిగిందని, 2025లో రూ. 5,337 కోట్లు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. 80 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన 40 ప్రాజెక్టులలో భాగంగా 4,300 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయని, 42 వేల కోట్ల రూపాయల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఏ ప్రాంత అభివృద్ధి అయినా రైలు మార్గం, రోడ్డు మార్గం, విమాన మార్గాలతో ముడిపడి ఉంటుందని, ఆర్థిక అభివృద్ధిలో 11వ స్థానం నుండి 4వ స్థానంలో నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి లక్ష 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. దేశంలో నష్టాలలో ఉన్న రైల్వే శాఖను ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ లాభాలలోకి తీసుకురావడం జరిగిందని,
ప్రజల అవసరాల మేరకు స్టేషన్లలో రైళ్ల నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. 3 కోట్ల 50 లక్షల రూపాయలతో మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి ఉదయం వేళలో హైదరాబాద్ కు ట్రైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో వందే భారత్ స్టాపేజీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.
మంచిర్యాల నుండి భక్తులు శబరిమలై వెళ్లేందుకు కేరళ ఎక్స్ ప్రెస్ రైలును మంచిర్యాలలో హాల్టింగ్ చేయాలని కోరారు. 10 వేల కోట్ల రూపాయలతో రామగుండం యూరియా ప్లాంట్ రీ ఓపెనింగ్ చేయించడం జరిగిందని, మరొక ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే యూరియా కొరత ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.