calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం బహుళ రంగాల్లో రాణిస్తోంది

16-09-2025 12:56:16 AM

-51 ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు పయనం

-గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ మెరుగు

-వర్సిటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి

-ఎంజీయూ స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలు అందజేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నల్గగొండ రూరల్, సెప్టెంబర్ 15: దేశం బహుళ రంగాల్లో రాణిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించి 51 ట్రిలియన్ డాలర్ల మైలురాయి వైపు పయనిస్తోందని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో సోమవారం నిర్వహించిన 4వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ మెరుగుపడిందన్నారు.

2015లో భారత్ ర్యాంక్81వ స్థానంలో ఉండగా నేడు 39వ స్థానానికి ఎగబాకిందన్నారు. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని, దార్శనికత, విలువలు శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలన్నారు. ఎంజీయూ మంచి పురోగతి సాధిస్తుందన్నారు. మొదటి తరం అభ్యాసకులు సహజమైన ప్రతిబంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వారు ఎదగడానికి ఒక పోషణ వేదికను అందిస్తున్నదన్నారు.

విద్యార్థుల హాజరును బలోపేతం చేయడం, హాస్టల్, క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాస న వాతావరణాన్ని పెంపొందించడంపై ఎంజీయూ కృషి ప్రశంసనీయమన్నారు. విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దడానికి పూర్వ విద్యార్థుల మద్దతును ఉపయోగించుకోవాలని సూచించారు. న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపులు యునివర్సిటీకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా సంస్థ పెరుగుతున్న ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తాయని అన్నారు. వర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికతలకు, ముఖ్యంగా పరిశ్రమలు,విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి కృత్రిమ మేధస్సుకు సిద్ధం చేయాలని కోరారు. విద్యార్థులు కూడా నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు.

హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని, ఇంజనీరింగ్ విభాగంలో చేయూతనివ్వాలని అన్నారు. ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో డిగ్రీ పొంది తనకి ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. అంతకుముందు గవర్నర్ 22 మందికి పీహెచ్‌డీలను, 57మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు.్ల కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్,అదనపు కలెక్టర్ శ్రీనివాస్,నారాయణామిత్‌లు గవర్నర్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ ఏడీసీ భవాని ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.