calender_icon.png 13 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

13-10-2025 12:00:00 AM

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఖమ్మం, అక్టోబరు 12 (విజయక్రాంతి): పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి ప్రాంతంలో ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి+2 కాలనీ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి+2 కాలనీ వయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డును కోటి 71 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నామని, ప్రజా దీవెనలతో ఏర్పడ్డ ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కోటి 53 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, 2 కోట్ల 65 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, మంచి నీటి సరఫరా కోసం సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. 

వెంకటగిరి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా జంగాల కాలనీ వరకు కోటి 32 లక్షలతో, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోట నారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో, వెంకటగిరి ఎస్సీ, బిసి కాలనీ నుండి గుదిమల్ల వరకు 2 కోట్ల 4 లక్షలతో మంజూరు చేసామని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గడిచిన 21 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 12 కోట్ల 47 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. 

మన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని , ఏదులాపురంలో మొదటి విడతలో 80 ఇందిరమ్మ ఇండ్లు అందించామని అన్నారు. అర్హులైన పేదలందరికీ మరో మూడు విడతలలో రాజకీయాలకతీతంగా సొంత ఇండ్లు ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కోటి 71 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటు న్నామని, దీని వల్ల ఇందిరమ్మ కాలనీలోని వందలాది కుటుంబాలకు ఖమ్మం కోదాడ రోడ్డు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. మంత్రి సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో అదనపు సౌకర్యాలైన డ్రైయిన్, త్రాగునీరు, అంతర్గత రోడ్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

కార్యక్రమ అనంతరం అక్కడే గతంలో చేపట్టి, నిర్మాణం పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ళని మంత్రి, కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. పెండింగ్ నిర్మాణ పనులు పూర్తిచేసి, పేదలకు అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏదులాపురంమునిసిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.