08-07-2025 01:15:38 AM
- రైల్వే పనులను పరిశీలించిన జీఎం సందీప్ పార్థు
- పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌కు పార్టీల వినతులు
మంచిర్యాల/బెల్లంపల్లి అర్బన్, జూలై 7: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ తో పాటు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ పార్థు సోమవారం పరిశీలించారు. ప్రత్యేక రైల్లో ఆయన మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లకు చేరుకున్నారు.
రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ నిర్మాణ, మూడో లైన్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని రైల్వే జీఎం ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అన్ని రకాల నిర్మాణ పనులను ఆయన నిశితంగా తనిఖీ చేశారు.
బెల్లంపల్లిలో నూతనంగా నిర్వహిస్తున్న ఫ్లాట్ ఫామ్ తో పాటు ట్రాక్ నిర్మాణ పనుల నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. వేగంగా నిర్దేశించిన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లో మూడో రైల్వే ట్రాక్, మూడో ఫ్లాట్ ఫామ్ నిర్మాణ పనుల పురోగతి పై జీఎం అధికారులతో చర్చించారు. ఆయా విభాగాల రైల్వే అధికారులు జీఎంకు నిర్మాణ అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం జీఎంకు నాయకుల వినతులు
మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లలో అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన రైల్వే జీఎం సందీప్ పార్థును పలు పార్టీల నాయకుల ప్రతినిధుల బృందం కలిసి ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదల కోసం వినతులు చేశారు. బెల్లంపల్లిలో నవజీవన్, అప్ జీ టీ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని సీపీఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాంనగర్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి రహదారికి అనుమతి ఇవ్వాలని కోరారు, ఈ మేరకు ఆయనకు పలు డిమాం డ్ల వినతి పత్రం అందజేశారు. రైల్వే జీఎం కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో సీపీ ఐ పట్టణ కార్యదర్శి ఆడెపురాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, సీపీఐ నాయకులు బొల్లం తిలక్ అంబేద్కర్, రత్నం రాజం తదితరులు ఉన్నారు.