24-09-2025 12:14:28 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 23 :(విజయ క్రాంతి): ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయిం చేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ జిల్లా అధికారు లకు సూచిం చారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసు కున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు.
ఆయా పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని, ఎం.పీ లాడ్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రాతిపదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉన్నాయని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం పనులపై దసరా సెలవుల అనంతరం తాను ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం అడవిమామిడి పల్లి, మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు.
పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రిడ్జిలు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలన్నారు. పీఎంశ్రీ పథకం గురించి ఎం.పీ వివరాలు కోరగా, ఈ పథకం జిల్లాలో 8 పాఠశాలలకు కేంద్రం ద్వారా నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చించామని డీఈఓ అశోక్ తెలిపారు.
మద్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు వెంటవెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలని, అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన కోడిగుడ్లు, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేయాలని ఎం.పీ సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎం.పీ జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
ఈ విషయమై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, గోదావరి, మంజీరా బ్యాక్ వాటర్ కారణంగా జిల్లాలోని పరీవాహక గ్రామాలకు ఆనుకుని ఉన్న పంటలు నీట మునగడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక పంపామని అన్నారు. అంతేకాకుండా వరదల వల్ల ఇసుక మేటలు వేసిన పంట పొలాల్లో ఉపాధి హామీ కూలీల ద్వారా ఇసుక మేటలు తొలగించేలా చర్యలు తీసుకున్నామని, వివిధ గ్రామాలలో పనులు జరుగుతున్నాయని వివరించారు.
పంట కోతలు పూర్తున అనంతరం అన్ని చోట్ల ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలచే తొలగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధులతో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు లబ్ది పొందేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చొరవ చూపుతున్నామని, ఫలితంగా 185 మందికి ఇటీవలే మంజూరీలు కూడా లభించాయని కలెక్టర్ తెలిపారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పోరేషన్ కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని,
అద్దె పెంపు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని అన్నారు. మల్లారం, బాబన్ సహబ్ పహాడి, సారంగాపూర్ హనుమాన్ మందిరం తదితర ప్రాంతాలలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని దిశా కమిటీ సభ్యులు ప్రస్తావించగా, పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతో సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణలను తొలగించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, దిశా కమిటీ సభ్యులు హన్మంత్ రావు, ఆశన్న, లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.