24-09-2025 12:13:00 AM
-నాణ్యత లేని, కల్తీ వస్తువులతో ఆహార పదార్థాల తయారీ
-వాడిన నూనెలతోనే ఫాస్ట్పుడ్.
-హోటళ్లలోనూ ఆయిల్ పునర్వినియోగం
-ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు
-అరకొరగా కేసుల నమోదు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 23 (విజయ క్రాంతి): ఇందు గలదు.. అందు లేదన్న సందేహం వలదు.. అన్న చందంగా నేడు చాలా ఆహార పదార్థాల్లో కల్తీ, నకిలీలతో ప్రజారోగ్యం దెబ్బ తింటోంది. బ్రాండెడ్లను పోలిన విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. కల్తీ వస్తువులతో చేసిన ఆహార పదార్థాలు, తినుబండారాలను అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడు తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు కల్తీ వస్తువులను మార్కెట్లో నింపేస్తున్నారు.
ఆహార కల్తీని, నకిలీల తయారీని అరికట్టాల్సిన ఆహార ప్రమాణాల పరిరక్షణ శాఖలో సిబ్బంది కొరత కూడా కల్తీ కేటుగాళ్లకు కలిసి వస్తోంది. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. అక్రమార్కులు ఉప్పు, పప్పులు, బియ్యం, గోధుమలు, నూనెలు ఇలా అన్నీ కల్తీ చేస్తున్నారు. ఆహార పరిరక్షణ శాఖ సిబ్బంది కొరతతో కల్తీ సరుకులకు అడ్డుకట్టే లేకుండా పోతోంది. ప్రధానంగా వంట నూనెలు, పాలు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, టీ పౌడర్, ఐస్ క్రీమ్లను కల్తీ చేసి అమ్ముతున్నారు.
హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ తయారీకి ఉపయోగించే నూనెలు, పిండి, మసాలాలు తదితర వస్తువులు చాలా మట్టుకు కల్తీవే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు చిరు వ్యాపారులు కల్తీ సరుకులను విరివిగా వాడుతుంటారు. స్థానికంగా ప్యాక్ చేసి అమ్మే కొన్ని వస్తువులు, పదార్థాలు ఎక్కడ, ఎవరు, ఎప్పుడు తయారు చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. వినియోగదారులెవరైనా ఫిర్యాదు చేస్తే తనిఖీ చేసి నమూనాలను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
ఈ మధ్య కాలంలో ప్రజలు బయట హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో తినేందుకు మక్కువ చూపుతుండడంతో ఇదే అదునుగా కొందరు వ్యాపారులు టేస్ట్గా చేస్తే చాలు.. వాడే వస్తువులు ఏవైతే నేం? అనే ధోరణితో కల్తీ వస్తువులను వాడుతున్నారు. జిల్లాలో చిన్నచిన్న హోట ళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దాబా లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, తోపుడు బండ్లపై తినుబండారాలు, మిక్చర్ పాయింట్లు తదితర చోట్ల కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రధా నంగా దాబా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాసిరకం/కల్తీ వస్తువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేసినా తీసుకునే చర్యలు శూన్యమే.
వాడిన నూనెలే మళ్లీ వాడకం..
పేరున్న హోటళ్లు మొదలు స్ట్రీట్ఫుడ్ తయారీదారుల వరకూ ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకూడదనే నిబంధనలున్నా రోజుల తరబడి ఇంకిపోయేదాకా అవే నూనెలు వాడుతున్నారు. అడుగున మడ్డి కట్టిన నూనెలోనే వేయించడం, కూరలు, చెట్నీ, సాంబార్లకు వాడుతున్నారు. పాల ఉత్పత్తులు, బ్రెడ్ వంటి వస్తువులు వారం రోజులు కూడా నిల్వ ఉండవు. తయారైన రోజు నుంచి వారంలోపే వాడేయాలి. అలాంటిది కొన్ని నాన్ బ్రాండెడ్ వస్తువులపై తయారీ తేదీ వేయకుండానే విక్రయిస్తున్నారు. బేకరీల్లో పఫ్లు, బిస్కెట్లు, స్వీట్లు నాణ్యతలేనివి అమ్ముతున్నారు.
బ్రాండెడ్ పేర్లతో నకిలీ వస్తువుల తయారీ..
బ్రాండెడ్ పేర్లతో కల్తీ/నకిలీ వస్తువులను తయారీ చేసి అమ్ముతున్నారు. కొద్ది తేడాను పాటిస్తూ బ్రాండ్ల పేర్లను పోలి ఉండేలా ఒక అక్షరాన్ని చేర్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు, మారుమూల ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ ఆహార పదార్థాల తయారీపైనా కల్తీ నియంత్రణ అధికారులు దృష్టిపెట్టాల్సి ఉంది. వంటనూనె, బిస్కెట్లు, మినరల్ వాటర్ బాటిళ్లు, చిప్స్, కుర్కురే లాంటి వస్తువుల నకిలీలను బ్రాండెడ్ ప్యాక్ పోలి ఉండేలా డిజైన్ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. నాసిరకం తినుబండారాలతో పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు. నకిలీ వస్తువుల అమ్మకాల్లో దుకా ణదారులకు మార్జిన్ ఎక్కువ ఉండటంతో వాటినే అంటగడుతున్నారు. లాభమే లక్ష్యంగా ప్రజారోగ్యాన్ని పాడుచేస్తున్నారు.
నామమాత్ర దాడులు.. తూతూ మంత్రంగా కేసులు..
కల్తీ దందా కేంద్రాలపై అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తూ కేసుల నమోదు, జరినామాల విషయంలో మరింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కల్తీ వస్తువుల తయారీ కంపెనీలపై, అలాగే వాటితో ఆహారాన్ని తయారు చేసి సర్వ్ చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దాడుల సమయాల్లో కేసులు నమోదైనా.. దందా తిరిగి కొనసాగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కల్తీ ఫుడ్ దందాను అరికట్టలేని పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం తీరు ఇలాగే కొనసాగితే మార్కెట్లో కల్తీ వస్తువులే రాజ్యమేలుతాయనడంలో సందేహం లేదు. జిల్లాలో ఏడాదికి 360 శ్యాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించాల్సి ఉంది.
అయితే అధికారులు జిల్లాలో నెలకు 12 శాంపిల్స్ మాత్రమే తీసి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఇందులో ఒక్కో నెల కేవలం రెండు, మూడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. సీజన్ను బట్టి పండ్ల దుకాణాలపైనా నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. కల్తీ జరిగిన, రంగులు కలిపిన ఆహార పదార్థాలకు నాన్ స్టాండర్డ్ పేరిట ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే వారికి నామమాత్రపు జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫుడ్సేఫ్టీ అధికారులు మేల్కొని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు ఈ సందర్బంగా కోరుతున్నారు.