calender_icon.png 23 May, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

22-05-2025 12:00:00 AM

అధికారులకు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశం

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 21( విజయ క్రాంతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారితో కలిసి పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మిషన్ భగీరథ, గృహ నిర్మాణ, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోగా పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు చేపట్టిన పనులలో పూర్తి అయిన వాటికి నిధుల విడుదల కోసం సంబంధిత ఇంజనీర్లు ఎం. బి. లు సమర్పించాలని, పాఠశాలలలో మౌలిక వసతులు త్రాగునీరు, భవన మరమ్మత్తులు, ప్రహరీ గోడల నిర్మాణం, మూత్రశాలలు, వంటశాలల నిర్మాణం, పెయింటింగ్ పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని తెలిపారు.

స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల ప్రతి పాఠశాలకు త్రాగునీరు అందించాలని, మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద పూర్తి చేసిన పాఠశాల భవనాల పెయింటింగ్ పనులు పూర్తిచేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతులతో పాటు విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, మూత్రశాలల నిర్మాణాలు చేపట్టాలని, పనులు పూర్తి చేసిన వాటికి నివేదిక సమర్పించాలని తెలిపారు.

రూర్బన్ పథకంలో భాగంగా సెంట్రల్ లైబ్రరీ మిగులు పనులు, అంగన్వాడి భవనాల పనులు, గ్రీనరీ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులు త్వర గా పూర్తిచేయాలని తెలిపారు. త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధుల ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

చేతిపంపులు, బోరు బావి మరమ్మ త్తులు, పరికరాల కొనుగోలు, టాంకర్ల ద్వా రా నీటి సరఫరా పనుల కోసం ఖర్చు చేయాలని, జిల్లాలోని ప్రతి ప్రాంతానికి త్రాగునీటిని అందించాలని, ఎస్.డి.ఎఫ్. నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన పిసి రోడ్డు పనులలో అసంపూర్తిగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయా లని తెలిపారు.

పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నమూనా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పైలట్ గ్రామాలలో మంజూరైన ఇండ్లను లబ్ధిదారులు త్వరగా ఆ ఆర్ మెంట్ పనులు ప్రారంభించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. 

హై లెవెల్ వంతెనలలో భాగంగా అప్రోచ్ రోడ్ కొరకు చేపట్టి భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు రోడ్లు భవనాల శాఖ అధికారులు నష్టపరిహారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈ ఈ ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, హౌసింగ్ డి ఈ వేణుగోపాల్, విద్యాశాఖ, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ, గృహ నిర్మాణ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.