11-07-2025 10:27:46 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇళ్లు, కాజీపేట ఆర్వోబీ నిర్మాణ పనుల పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత పనులపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కాజీపేట ఆర్వోబీ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా చేపట్టాలన్నారు. అధికారులు, గుత్తేదారు సంస్థ సమన్వయంతో పనులు పూర్తిచేయాలన్నారు. నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివరాలను, ఇప్పటివరకు వాటి పురోగతిపై కలెక్టర్ అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనుల గురించి సాగునీటిపారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.