02-11-2025 07:05:30 PM
ఈనెల 8న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా..
ఏఐటియుసి జనరల్ సెక్రెటరీ కొరిమి రాజకుమార్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఈనెల 8న అన్ని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ స్పష్టం చేశారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మూడుసార్లు స్ట్రక్చర్ సమావేశాలు జరగగా ఇందులో ఒకసారి సిఅండ్ ఎండి తో, రెండుసార్లు డైరెక్టర్ పా తో సమావేశాలు జరిగిన ప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారంకు నోచుకోలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.
గత మార్చి నెల నుండి ఇప్పటివరకు ఎనిమిది నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించ కుండా కార్మికులకు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని యజమాన్యం తీరుపై విరుచుకుపడ్డారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు తీసుకున్న కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి వారిని ఇన్వాలిడేషన్ చేసి వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ యజమాన్యం నిర్లక్ష్యం మూలంగా గత 18 నెలలుగా కార్మికులు వారి వారసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులను ఇన్వాలిడేషన్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇదివరకు మెడికల్ బోర్డు ద్వారా ఇన్వాలి డేషన్ అయిన వారి వారసుల కు వెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నారు.
సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, పేర్క్స్ పై కొలిండియా మాదిరిగా సింగరేణి యాజమాన్యమే ఐటీ నీ భరించాలని, మారుపేర్లను సవరించి విజిలెన్స్ ఇబ్బందు లను తొలగించాలని, 150 మస్టర్ల నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లతో ఈనెల 6న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లపై, 8న జిఎం కార్యాలయాలు ఎదుట ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఆందోళన కార్యక్రమాలతో యజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే జనవరి నెలలో అన్ని కార్మిక సంఘాల ను కలుపుకొని నిరవధిక సమ్మెకు ఏఐటియుసి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్య నారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, మైనింగ్ స్టాప్ నాయకులు గోపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య,లింగయ్య, జెట్టి మల్లయ్య ఏరియా నాయకులు సీవీ రమణ, ఎగ్గెటి. రాజేశ్వరరావు, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, అంతోని దినేష్, సిపిఐ నాయకులు కామెర దుర్గరాజు, లు పాల్గొన్నారు.