27-01-2026 12:15:06 AM
డియాజియో ఇండియా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా, కొల్లాపూర్ 'మోడల్ పబ్లిక్ లైబ్రరీ'లో మౌలిక సదుపాయాలను ఆధునికీకరించింది. ఆధునీకరించిన ఈ గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రారంభించారు. తాను పనిచేసే కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సరైన పద్ధతిలో వ్యాపారం చేయడం డియాజియో ఇండియాకు ఉన్న నిబద్ధతను గుర్తు చేస్తోందని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఈ మౌలిక సదుపాయాల మెరుగుదలలో రీడింగ్ ఏరియాలు, మెరుగైన సీటింగ్, లైటింగ్, మరిన్ని పుస్తకాల సేకరణ, డిజిటల్ యాక్సెస్, సౌకర్యవంతమైన ఫీచర్లు మరియు మరెన్నో ఉన్నాయి. స్థానికులకు మరియు విద్యార్థులకు సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే, అభ్యాసానికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే దీని లక్ష్యం. అప్‌గ్రేడ్ చేసిన ఈ లైబ్రరీ వల్ల పరిసర ప్రాంతాలలోని 500 మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రాంతంలో విద్యావకాశాలు, ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. డియాజియో ఇండియా ప్రాజెక్ట్ పార్టనర్ అయిన 'తర్క్ ఫౌండేషన్' భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.
పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులు, యువత ఇక్కడ లభించే పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనీ మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కూడా ఈ ప్రమాణాలతో కూడిన గ్రంథాలయం లేదన్నారు. కొల్లాపూర్‌లోని విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, యువత ఈ డిజిటల్ లైబ్రరీని చురుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డియాజియో ఇండియా కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ దేవాశిష్ దాస్‌గుప్తా, తర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపక భాగస్వామి లక్షణ ఆస్థానా పాల్గొన్నారు.