03-07-2025 12:00:00 AM
ఎల్బీనగర్, జూలై 2: వీరి కన్నుపడితే ఆలయంలో చోరీ పక్కా. ఆలయంలోని పంచలోహ విగ్రహాలు, గుడి గంటలు, దీపాల స్టాండ్, హుండీలు, ఆభరణాలను చోరీ చేస్తారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేస్తున్న కరుడుగట్టిన ఇద్దరు దొంగలతోపాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న స్క్రాప్ దుకాణం నిర్వాహకుడిని అరెస్టు చేసి, మొత్తం రూ. 5,36,300 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం ఎల్బీనగర్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం లో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. ఏపీ లోని కర్నూల్ కు చెందిన కరాచ శివానంద(52) హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. ఏపీ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్ కే హమ్ షరీఫ్(38) హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నాడు. శివానంద, షేక్ హామ్ షరీఫ్ కూలీ పనులు చేస్తుండగా లేబర్ అడ్డాల వద్ద పరిచయం పెరిగి, స్నేహితులుగా మారారు.
ఇద్దరూ తాగుబోతులు... డబ్బు అవసరం కావడంతో దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో ఆటో అద్దెకు తీసుకుని తిరగడం ప్రారంభించారు. ఫిబ్రవరి 27న యాచారం మండలం గండ్లగూడలోని మల్లికార్జున, శివాలయాల్లో చోరీ చేశారు. జూన్ 15న ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడలోని మల్లన్న స్వామి ఆలయంలో దొంగతనం చేశారు. జూన్ 24న ఉప్పల్ లో బైక్ దొంగతనం చేశారు.
చోరీ చేసిన బైక్ పై ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. జూన్ 29న అబ్దుల్లాపూర్మెట్లోని సద్దుపల్లిలోని హనుమాన్ ఆలయం, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు దొంగిలించారు. జూన్ 30న ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో శివగంగ, హనుమాన్ ఆలయాల్లో పంచలోహ విగ్రహాలు, బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించారు.
జులై 2న విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం పోలీసులు ఉదయం 8:30 గంటలకు మంగల్ పల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని విచారించి, మొత్తం రూ. 5,36,300 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీ చేసిన వస్తువులను ఉప్పల్ లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్న అక్కపల్లి క్రాంతి కుమార్(31) కు విక్రయించేవారు.
నిందితుల్లో శివానంద్ పై గతంలో కేసులు ఉన్నాయి. షేక్ హామ్ షరీఫ్ పై పాత కేసులు లేవు. వీరిద్దరిపై ప్రస్తుతం యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చోరీ కేసులను ఛేదించిన పోలీసులు, సిబ్బందిని సీపీ సుధీర్ బాబు అభినందించారు.
సమావేశంలో సీసీఎస్ ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్.విజయ్ కుమార్, సబ్ ఇన్ స్పెక్టర్లు అశోక్, అనిల్, రవికుమార్, ఏఎస్త్స్ర విద్యాసాగర్, కానిస్టేబుళ్లు తస్లీం, బాలకృష్ణ, రమేశ్, రాజ్ కుమార్, సుధీర్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, రాజు, ఈశ్వర్, జవహర్లాల్, శేఖర్, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ చందర్ సింగ్, కానిస్టేబుళ్లు కోటేశ్వర్ రావు, కె.చంద్రశేఖర్, బి.రాజు, ఎన్.నగేశ్ తదితరులుపాల్గొన్నారు