18-11-2025 12:08:18 AM
-సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన 57 ఏళ్ల మహిళ
-వివిధ రూపాల్లో 187 లావాదేవీలు
-బెంగళూరులో ఘటన
బెంగళూరు, నవంబర్17 : సైబర్ నేరగాళ్లు ఓ 54 ఏళ్ల మహిళను డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ రూ.32 కోట్లను కొల్లగొట్టారు. మోసగాళ్లు డీహెచ్‌ఎల్, సైబర్‌క్రైమ్ డిపార్ట్‌మెంట్, సీబీఐ, ఆర్‌బీఐ సీనియర్ అధికారుల పేరుతో నెలరోజులపా టు ఆమెను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ రకమైన డిజిటల్ అరెస్ట్ ద్వారా జరిగిన అతిపెద్ద సైబర్ మోసాల్లో ఇదొకటని పోలీసులు భావిస్తున్నారు.
బాధితురాలు ఈ నెల 14న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితురాలికి సె ప్టెంబర్ 15, 2024న డీహెచ్‌ఎల్ అందేరి అధికారిగా ఓ వ్యక్తి పోన్ చేశాడు. ముంబైలోని అంధేరి నుంచి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్పోర్టులు, మూడు క్రెడిట్ కార్డులు, ఎండీఎంఏ వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని బెదిరించాడు. తాను ముంబైకి ప్రయాణించలేదని ఆమె చెప్పినప్పటికీ, కాల్ చేసిన వ్యక్తి ఈ విషయా న్ని సైబర్ క్రైమ్ కేసుగా పరిగణిస్తున్నారని ఒత్తిడిచేశాడు.
ఆమె స్పందించేలోపు, ఆ కాల్ సీబీఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులకు బదిలీ చేశాడు. వారు ఆమెను అరెస్టు చేస్తామని,‘నీకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి. స్థానిక పోలీసులను సంప్రదించవద్దు. మీ ఇంటిపై నిఘా పెట్టాం’ అని హెచ్చరించారు. భయపడిపోయిన ఆమె ద్వారా రెండు స్కైప్ ఐడీలను ఇన్‌స్టాల్ చేయించారు. తర్వాత మోహిత్ హండాగా పరిచయం చేసుకున్న వ్యక్తి వీడియోలో ఆమెను రెండురోజులుగా గృహ నిర్బంధం చేశాడు.
ఇలా మోసగాళ్లు పలువిధాలుగా భయపెట్టారు. సెప్టెంబర్ 24, అక్టోబర్ 22, 2024 మధ్య, ఆమె తన బ్యాంకు వివరాలన్నింటినీ వారికి అందజేసింది. ఆ తర్వాత మోసగాళ్లు ఆమె ఆస్తులలో 90 శాతం క్లియరెన్స్ కోసం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. తరువాత, అదనంగా రూ.2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని, మరిన్ని మొత్తాలను పన్నుల పేరుతో ఆమెను వేధించారు. డిసెంబర్ 6న ఆమె కొడుకుకు నిశ్చితార్థం చేసింది. మోసగాళ్లు 2025 ప్రారంభంలో కూడా డబ్బు డిమాండ్ చేశారు. డిపాజిట్ చేసిన మొత్తాలను ఫిబ్రవరి నాటికి తిరిగి ఇస్తామని పదేపదే హామీ ఇచ్చారు.
అయినా డబ్బు తిరిగి పంపలేదు. మార్చి 26, 2025న అన్ని కమ్యూనికేషన్లను అకస్మాత్తుగా సైబర్ నేరగాళ్లు ఆపేశారు. మొత్తంగా, బాధితురాలు రూ.31.83 కోట్ల విలువైన 187 లావాదేవీలను ఆమె ఫోన్ ద్వారా కొట్టేశారు. ఈ మోసం గురించి ఆమె ఎక్కడా చెప్పకుండా లోలోన కుమిలిపోయింది. జూన్ 8న తన కొడుకు పెళ్లి జరిగాక ఆ మోసం నుంచి తేరుకుని ఫిర్యాదు చేస్తున్నాని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.