18-11-2025 12:10:50 AM
-షాహీన్ ఫోన్‌లో ఉగ్రకుట్రల చాట్
-ఢిల్లీ పేలుడు కేసులోమిస్టరీ మహిళలేరి?
-ఆరు నగరాల్లో ఆపరేషన్ డీ6 కుట్ర!
-టెలిగ్రామ్‌లో ‘వైట్ కాలర్ టెర్రర్’ మెసేజ్
-హైదరాబాద్‌లో అల్ ఫలాహ్ చాన్సలర్ సోదరుడి అరెస్టు
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ పేలుడు కేసులో అనేక కీలక విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఎర్రకోట సమీపంలో ఐ20 కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌కు భారత్‌లోని జైషే మహ్మద్ నెట్‌వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగస్వాములైన ఉగ్రవాది డాక్టర్ షాహీన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
పేలుళ్లతోపాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధించిన అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఘటనతోపాటు జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాహీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా షాహీన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్‌లో కీలక ఆధారాల్ని రాబట్టారు.
మేడమ్ ఎక్స్, మేడమ్ జెడ్
వాటిలో మేడమ్ ఎక్స్, మేడమ్ జెడ్ పేరుతో సేవ్ చేసిన మహిళలతో షాహీన్ మాట్లాడినట్లు తేలింది. అదే సమయంలో ఈ రెండు నంబర్ల నుంచి డాక్టర్ షాహీన్‌కు క్రమం తప్పకుండా కాల్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఆ మెసేజ్‌లలో ‘మెడిసిన్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించినట్లు , మెడిసిన్ అంటే పేలుడు పదార్థాలేనని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ అంటే వేరేదేమైనా ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
ఓ మెసేజ్‌లో మేడమ్ ఎక్స్ నుంచి షాహీన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ‘ఆపరేషన్‌కు ఔషధ కొరత ఉండకూడదు’ అని ఉంది. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో లింకులున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహీన్ ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించింది. ఈ నెట్ వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీ6 మిషన్‌కు ప్లాన్ చేసిందని, ఇంకా అనేక కుట్రలు విచారణలో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన అనుమానితులను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి.
తుర్కియే పర్యటనలో గ్రీన్ సిగ్నల్..
టెర్రర్ మాడ్యూల్‌లోని సభ్యులు ఐఎస్‌ఐ హ్యాండ్లర్ ఉకాసాను కలిసేందకు తుర్కియేలో పర్యటించారని తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్, ఉగ్రసంస్థ జైషే, అన్సర్ సంస్థల నిర్వాహకులకు ఈ స్పైడర్‌తో నేరుగా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో డిసెంబర్ 6 దాడికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
కొత్త ఎత్తుగడలు
పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘాను తప్పించుకుని తమ కుట్రలను సులభంగా అమలు చేసేందుకు ఉగ్రవాద గ్యాంగ్‌లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. నేర ముద్రలేని వాళ్లు, వేర్పాటువాదులతో సంభందంలేని యువకులు, పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘాలో లేని వారిని తమ ముఠాలో చేర్చుకుని శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యూహం గత 20 ఏళ్లుగా ఉగ్రవాద సంస్థలు అనుసరిస్తునట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులైన డాక్టర్ అదీల్ రాథర్, అతని సోదరుడు డాక్టర్ ముజఫర్ రాథర్, డాక్టర్‌ముజమ్మిల్ గనాయిలకు, వారి కుటుంబీకులకు ఇప్పటి వరకూ నేరచరిత్ర లేదని తేలింది. అయితే ఉగ్రసంస్థలు తమ కుట్ర అమలు కోసం ఏడాది కాలంగా ఆత్మాహుతి బాంబర్ కోసం వెతికినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఢిల్లీ బాంబు పేళుడు కేసులో కీలక నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వని అలియాస్ డానిష్‌ని ఎన్‌ఐఏ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. బాంబు తయారీకి సాంకేతిక అంశాలను బిలాల్ అదించాడని, ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీతో పనిచేశాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. బిలాల్ జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన వాడని పేర్కొంది.
వర్సిటీ ఛాన్సలర్ సోదరుడి అరెస్టు
ఢిల్లీ పేలుడు దర్యాప్తుతో సంబంధం ఉన్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ ఛాన్సులర్ సోదరుడిని దాదాపు 25 ఏళ్ల నాటి మోసం కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో సోమవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ ఛాన్సులర్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీ తమ్ముడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ(50) అరెస్టుకు రూ.10,000 రివార్డు కూడా అప్పట్లో ప్రకటించినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్ పట్టణంలో సుమారు రూ.40 లక్షల పెట్టుబడి మోసం కేసులో నమోదైన మూడు కేసులకు సంబంధించి అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) యాంగ్‌చెన్ డోల్కర్ భూటియా మీడియాకు తెలిపారు.
పాత క్రిమినల్ కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా మా నలుగురు సభ్యుల బృందం అతన్ని పట్టుకుందని అని ఆమె చెప్పారు. ‘పెట్టుబడి ముసుగులో ప్రజల నుంచి డబ్బు తీసుకొని దానిపై 20 శాతం వడ్డీ ఇస్తానని హామీ ఇచ్చాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతను రెండు సంవత్సరాలు మోవ్‌లో కంపెనీని నిర్వహించాడని, మూడో సంవత్సరంలో తన కుటుంబంతో పట్టణం నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. ‘2019లో హమూద్ సిద్ధిఖీని అరెస్టు చేసేందుకు రూ.10,000 రివార్డును ప్రకటించారు’ అని అధికారి తెలిపారు. ప్రస్తుతం, అతను హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిలో నిమగ్నమైన ఒక ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడని భూటియా చెప్పారు.
కోడ్ లాంగ్వేజ్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో భద్రతా సంస్థలు ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ముఠా అం దరి దృష్టిని మళ్లించేందుకు సాధారణ వంటకాల పేర్లను ఉపయోగించి, ఉగ్రవాద ప్రణాళికలు వేశారని, ఇందుకు టెలిగ్రామ్‌ను ఉపయోగించారని ద ర్యాప్తు వర్గాలు తెలిపాయి. ‘మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ రద్దు చేసిన నలుగురు వైద్యులు టెలిగ్రామ్‌లో తమకు ఇష్టమైన భోజనం గురించి చాట్ చేశారు. వారు మాట్లాడిన ఆహారం ఆహారం తో సంబంధం లేదు, కానీ చంపడం గురించి మాత్ర మే’ అని విచారణ వర్గాలు పేర్కొన్నాయి.
ముజామిల్ షకీల్, ఉమా ఉన్ నబీ, షాహీన్ సయీద్, అదీల్ అహ్మద్ రాథర్లతో కూడిన టెర్రర్ మాడ్యూల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్టెడ్ యాప్ టెలిగ్రామ్‌లో ఉగ్రవాద ప్రణాళికలను తెలియజేయడానికి ‘బిర్యానీ’ ‘దావత్‘ వంటి కోడ్ పదాలను ఉపయోగించిందని తెలిపాయి. ‘బిర్యానీ‘ అంటే పేలుడు పదార్థం అని, ‘దావత్‘ అనేది ఒక నిర్దిష్ట సంఘటనను సూచిస్తుందని పేర్కొన్నాయి. జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలలో ఉగ్రవాద దాడికి పేలుడు పదార్థాలను సిద్ధం చేసిన తర్వాత, వారు టెలిగ్రామ్‌లో ‘బిర్యానీ సిద్ధంగా ఉంది’ అనే మెసేజ్ పంచుకున్నారని తేలింది.
డ్రోన్ల దాడికి కుట్ర
ఢిల్లీ ఆత్మాహుతి కార్ బాంబు దాడిలో పాల్గొన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడికి ముందు డ్రోన్లను ఆయుధాలుగా మార్చడానికి, వీటిని ఉపయోగించేందుకు రాకెట్ల తయారీకి కుట్ర చేసిందని ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ రకమైన కుట్ర అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ హమాస్ దాడికి సమాంతరంగా ఉంటుందని చెప్పింది. ప్రాణాంతకమైన కార్ బాంబు పేలుడుకు ముందు డ్రోన్లను సవరించడం, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఉగ్రవాద దాడులు చేయడానికి డానిష్ సాంకేతిక సహాయం అందించాడని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కెమెరాలతో పాటు భారీ బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్ల తయారీకి డానిష్ ప్రయత్నించాడని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.