29-01-2026 01:07:45 AM
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎన్ శంకర్ మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ (78) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు దర్శకుడు ఎన్ శంకర్‌తోపాటు మరో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సక్కుబాయమ్మ భౌతికకాయాన్ని గురువారం ఉదయం నుంచి చిత్రపురి కాలనీలోని హెచ్‌ఐజీ బ్లాక్ సందర్శించవచ్చు. మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిం చనున్నారు. శంకర్ కుటుంబానికి ధైర్యం కలగాలని, సక్కుబాయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ నెటిజన్లు సానుభూతిని తెలియజేస్తున్నారు. డైరెక్టర్ ఎన్ శంకర్ పలు సామాజిక స్పృహ కలిగిన చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా ఆయన రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉప్పందించింది. 2011 సంవత్సరానికి గాను ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం. ‘శ్రీరాములయ్య’, ‘ఆయుధం’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘ఎన్‌కౌంటర్’, ‘యమజాతకుడు’ వంటి చిత్రాలు కూడా ఎన్ శంకర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.