29-01-2026 01:12:33 AM
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న మరో చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇటీవల చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శ్రుతిహాసన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది.
బుధవారం శ్రుతి పుట్టిన రోజు. దీంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీటీమ్ ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. కథలో శ్రుతిహాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుందని టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా వేసవి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.