05-11-2025 12:20:57 AM
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలు రైతులు
చిట్యాల, నవంబర్ 4 (విజయక్రాంతి): గత వారం రోజుల క్రితం రైతులు పండించిన పత్తి పంటను విక్రయించడానికి ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సొంత భూమి కలిగిన రైతులు పత్తిని స్లాట్ బుకింగ్ విధానంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. కానీ కౌలు రైతులకు పత్తి అమ్ముకునే వెసులుబాటు ఇంకా కల్పించలేదు.గత ఏడాది వ్యవసాయ విస్తరణ అధికారులకు మ్యానువల్ గా కౌలు రైతులను గుర్తించి సర్టిఫికెట్స్ జారీ చేస్తే సీసీఐ కేంద్రాలకు నేరుగా వెళ్లి పత్తిని విక్రయించుకునేవారు.
కానీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని చెబుతున్న అధికారులు నేటికీ అమలు చేయడం లేదు.దీంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇన్ని రోజులు కష్టపడి పత్తి పంటను ఆరబెట్టుకున్నామని మళ్లీ వర్షాలు కురిస్తే తేమశాతం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులను రైతులు సంప్రదిస్తే ఇంకా తమకు ఎలాంటి లాగిన్స్ ఇవ్వలేదని చెబుతున్నట్లు కౌలు రైతులు వాపోతున్నారు.
ఈరోజు లాగిన్స్ వస్తాయి నేడు వస్తాయ్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులు స్పందించి కౌలు రైతులు పత్తిని విక్రయించుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. లేనిచో వ్యవసాయ కార్యాలయాల ముందు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని కౌలు రైతులు హెచ్చరిస్తున్నారు.
సీసీఐ ప్రారంభం నుంచి వేచి చూస్తున్నా..
అధిక వర్షాల వల్ల ఈసారి పంటలు అం తంతగా మాత్రమే దిగబడి వచ్చాయి. ఇందు లో పత్తి పంట అధికంగా నష్టాన్ని మిగిల్చింది. కౌలుదారులు పత్తిని అమ్ముకోవాలంటే గతంలో ఏఈఓలు లెటర్లు ఇచ్చేవారు.ప్రస్తుతం ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు. ఇప్పటికే పత్తిని ఆరబెట్టుకొని వేచి చూస్తున్నా. మళ్లీ వర్షాలు కురిస్తే మా పరిస్థితి ఏంటి. ఇప్పటికైనా వ్యవసాయ అధి కారులు స్పందించి కౌలు రైతులు పత్తిని అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాలి.
కన్నవేని శ్రీకాంత్, యువ కౌలు రైతు.