25-10-2025 03:24:49 PM
గీతం విద్యార్థులకు నృత్య వ్యక్తీకరణ కదలికలపై ట్రిబుల్ ఐటీ ఆచార్యుడి శిక్షణ
పటాన్ చెరు: నృత్య సాధనలో సమన్వయం, ఏకాగ్రత, సృజనాత్మక ఆలోచనను మెరుగుపరచడంతో పాటు వారి కదలికపై విశ్లేషణాత్మక అవగాహనను పెంపొందిస్తాయని ట్రిబుల్ ఐటీ, హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ జయచంద్రన్ సురేంద్రన్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళలు (ఫైన్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) విభాగం ఆధ్వర్యంలో ‘కదలికల ఉద్యమం’ పేరిట రెండు రోజుల కార్యశాలను నిర్వహించారు.
కాళ్ల స్థానాలు, పాదాల ద్వారా కదలిక యొక్క విభిన్న రీతులపై ఈ కార్యశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. నృత్యాన్ని ఆకర్షణీయంగా, మేధోపరంగా ఉత్తేజపరిచేలా ప్రదర్శించారు. నృత్య అక్షరాస్యతపై డాక్టర్ జయచంద్రన్ కొనసాగిస్తున్న పరిశోధనలో భాగంగా, ఏదైనా ఒక రూపం లేదా శైలి యొక్క సరిహద్దులను అధిగమించే నృత్యం యొక్క సమగ్రమైన బోధనను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యశాల కొనసాగింది.
ఆచరణాత్మక అన్వేషణ ద్వారా నృత్య కదలికలకు ఆధారమైన సంక్లిష్ట నమూనాలను గుర్తించి అర్థం చేసుకోమని విద్యార్థులను ప్రోత్సహించారు. నృత్య సౌందర్యం, సంక్లిష్టత తరచుగా సరళమైన తార్కిక, గణిత నిర్మాణాల నుంచి ఉత్పన్నమవుతాయని, ఈ అంతర్లీన నమూనాలను అర్థం చేసుకోవడం ద్వారా, నృత్యకారులు వివిధ శైలులలో వారి సొంత కదలికలను సృజనాత్మకంగా నిర్మించుకోవచ్చని డాక్టర్ జయచంద్రన్ ఉద్బోధించారు. శారీరక కదలికలు, తలపుల (అభిజ్జా) సవాలును కలిపి ఆలోచనాత్మకంగా రూపొందించిన మేధస్సు కసరత్తులో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యశాలను లలిత, ప్రదర్శన కళల విభాగం, నృత్య విభాగం అధ్యాపకులు డాక్టర్ లలితా సింధూరి, పీ.బీ. వైష్ణవి సమన్వయం చేశారు. మొత్తంమీద, ఈ కార్యశాలలో పాల్గొన్నవారికి నృత్య సృష్టి, వివరణపై లోతైన అవగాహనను కల్పించారు. విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, లోతుగా గమనించడానికి, తర్కం, లయ, ఊహల సామరస్యం ద్వారా విద్యార్థులు తమదైన ప్రత్యేక నృత్య వ్యక్తీకరణలను అభినయించేలా ప్రేరేపించింది.