15-11-2025 03:14:16 PM
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్లు పూర్తి చేసుకోవాలి
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
అనంతారంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఇల్లంతకుంటలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
హౌసింగ్ మోడల్ హౌస్ ప్రారంభం
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల నెరవేరుతున్నదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఫిల్లర్ రూఫింగ్ తో ఖర్చు ఆదా
ఈ సందర్భంగా ఇల్లంతకుంటలో ఉన్న 40, ఓబులాపూర్ లో 24 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేసి, ప్రొసీడింగ్స్ ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ పంపిణీ చేశారు. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ కలిసి ప్రారంభించారు. ఇంటిలో వాతావరణం చల్ల బరిచేందుకు, నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో పూర్తి చేయడాన్ని చూసి అభినందించారు.
అనంతారం గ్రామంలో గన్నెపల్లి అనూష అనే లబ్ధిదారు ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోగా, నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే, ఇంచార్జి కలెక్టర్ హాజరయ్యారు. గృహ ప్రవేశం చేసి, లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల స్వంత ఇంటి కల నెరవేరుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని వెల్లడించారు. నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం మంజూరు చేస్తుందని వెల్లడించారు.
వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని పిలుపు ఇచ్చారు.అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసి, గృహ ప్రవేశానికి ఆహ్వానించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో తహసిల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ శశికళ, హౌసింగ్ డీఈ ఖాజా ముజఫర్ తదితరులు పాల్గొన్నారు.