16-12-2025 05:34:05 PM
జిల్లాలో 85 గ్రామ పంచాయతీలు, 636 వార్డులలో పోలింగ్ నిర్వహణ
మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వ ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పెద్దపల్లి, సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఓదెల మోడల్ స్కూల్, ఎలిగేడు మండలంలోని ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ ఓదెల మండలాలలోని 91 గ్రామ పంచాయతీలు, 852 వార్డులలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశామని, 6 గ్రామ పంచాయతీలు, 215 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని, ప్రస్తుతం 85 గ్రామ పంచాయతీలు, 636 వార్డులలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
పోలింగ్ బృందాలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సంబంధిత సామాగ్రి సరి చూసుకొని బయలు దేరాలని, గ్రామాలలో ఉదయం 7 గంటలకు సకాలంలో పోలింగ్ ప్రారంభించాలని, ప్రతి 2 గంటలకు రిపోర్ట్ పంపాలని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత లంచ్ త్వరగా పూర్తి చేసుకుని, మధ్యాహ్నం రెండు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఉప సర్పంచ్ ఎన్నికలు సైతం అదే రోజు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. 67 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు తమ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ జడ్పీ సీఈఓ నరేందర్, తహసీల్దార్ లు రాజయ్య, యాకన్న, బషీరోద్దీన్, ధీరజ్, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.