23-12-2025 12:49:58 AM
90 శాతం రైతులకు ధాన్యం డబ్బులు జమ
ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఖమ్మం జిల్లాలో సజావుగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలుపై వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు జిల్లాలో సజావుగా జరుగుతుందని, 90 శాతం రైతులకు చెల్లింపులు కూడా పూర్తి చేసామని, డిసెంబర్ చివరి నాటికి చాలా వరకు మండలాల్లో కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, వైరా మండలంలోని కొన్ని గ్రామాలలో సంక్రాంతి వరకు కొనుగోలు జరిగే ఆస్కారం ఉంటుందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో 331 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 43 వేల 236 మంది రైతుల నుంచి సుమారు 601 కోట్ల విలువ గల 2 లక్షల 51 వేల 847 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 37 వేల 373 మంది రైతులకు 530 కోట్లకు పైగా నిధులు చెల్లింపులు చేశామని అన్నారు. జిల్లాలో 22 వేల 83 మంది రైతుల దగ్గర నుంచి సన్న వడ్లు కొనుగోలు చేసి 68 కోట్ల 33 లక్షల 86 వేల 400 రూపాయలు బోనస్ క్రింద అందించామని అన్నారు. జిల్లాలో మరో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సైతం పటిష్ట కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం రవాణాకు సంబంధించి వినియోగించే 320 వాహనాలలో జి.పి.ఎస్. ట్రాకర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ పరిధిలో అనేక అంశాలలో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏ.ఈ.ఓ. లు, ఇతర సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.