23-12-2025 01:40:27 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భౌగో ళిక, రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చేసే కీలక ఘట్టం పూర్తయింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తు తం ఉన్న 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లుగా విభజించే బృహత్తర ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిం ది. డీలిమిటేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ ప్రక్రియకు ఉన్న ప్రధానమైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
కోర్టు తీర్పు, వేల సంఖ్యలో వచ్చిన ప్రజా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. వార్డుల పునర్విభజన తుది నివేదికను సిద్ధం చేసింది. అనేక వడపోతల తర్వాత రూపొందించిన సవరణలతో కూడిన సమగ్ర నివేదికను అధికారులు సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. దీంతో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌లోపే ప్రక్రియను పూర్తి చేసి, ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయడానికి మార్గం సుగమమైంది.
వార్డుల పేర్లపైనే ఎక్కువ అభ్యంతరాలు
ఈ నెల 9న వార్డుల పునర్విభజనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయగా, డిసెంబర్ 10 నుంచే అభ్యంతరాల స్వీకరణ మొదలైంది. తొలిరోజు కేవ లం 40 అభ్యంతరాలు మాత్రమే రాగా, కోర్టు ఆదేశాలతో గడువు పెంచిన తర్వాత జోనల్, సర్కిల్, ప్రధాన కార్యాలయాలకు వినతులు పోటెత్తాయి. దాదాపు 10 వేల అ భ్యంతరాలు, సలహాలు అందాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు జోన్ల వారీగా ఐదుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీలను నియమించారు.
ఈ కమిటీలు సోమవారం సాయంత్రం వర కు అభ్యంతరాల సాధ్యసాధ్యాలను పరిశీలిం చి, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా ముసాయిదాలో కీలక మార్పులు చేశాయి. వార్డుల విభజనలో భౌగోళిక సరిహద్దుల కంటే, వార్డుల పేర్ల విషయంలోనే ప్రజల నుంచి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన వార్డులకు పెట్టిన పేర్లు స్థానిక చరిత్రను, ప్రజల సెంటిమెంట్ను ప్రతిబింబిం చడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
స్థాని క ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాల విజ్ఞప్తులను గౌరవిస్తూ అధికారులు సుమారు 70 నుంచి 80 వార్డుల పేర్ల ను మార్చారు.బాగ్ అంబర్ పేట.. పునర్విభజనలో భాగంగా ఒక వార్డుకు అధికారులు తొలుత డీడీ కాలనీ అని పేరు పెట్టారు. అయితే అది చారిత్రక ప్రాంతమైనందున ప్రజాప్రతినిధుల సూచన మేరకు బాగ్ అంబర్ పేట గానే కొనసాగాలని నిర్ణయించారు.మోండా మార్కెట్.. సికింద్రాబాద్ జోన్లోని ఓ వార్డుకు మోండా మార్కెట్ గా పేరు మార్చారు.
ఇలా ప్రజల నోళ్లలో నానుతున్న పేర్లనే వార్డులకు ఖరారు చేశారు.కేవలం పేర్లే కాకుండా, వార్డుల భౌగోళిక సరిహద్దుల విషయంలోనూ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక మున్సిపల్ వార్డు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ముఖ్యంగా బీహెచ్‌ఈఎల్ వంటి ప్రాంతాల్లో గతంలో జరిగిన సరిహద్దు లోపాలను, జనాభా వ్యత్యాసాలను సరిదిద్దుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో సవరణలు చేశారు.
అధికారులు సోమవారం పంపిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర పడగానే, జీహెచ్‌ఎంసీ కమిషనర్ వార్డుల పునర్విభజనపై ఫైనల్ నోటిఫికేషన్ గెజిట్ జారీ చేయనున్నారు. 300 వార్డుల భౌగోళిక స్వరూపం ఖరారవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపై పడింది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం 2026, ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది.
ఈ గడువు ముగిసిన తర్వాతే రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో వార్డులో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో అడుగులు శరవేగంగా పడుతున్నాయి.
హైకోర్టులో వాదనలు
జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజనను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంసీహెచ్‌ఆర్డీలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా వార్డుల పునర్విభజన చేశామని ప్రభుత్వం చెపుతున్నా.. ఆ నివేదికను బయటపెట్టలేదని, అభ్యంతరాల స్వీకరణకు తగినంత గడువు ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు లాయర్లు హైకోర్టులో వాదించారు.
చట్టపరిధిలోనే నోటిఫికేషన్ జారీ చేశామని, సమాచారం వెబ్‌సైట్‌లో ఉంచామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యంతరాల స్వీకరణ గడువు ఇప్పటికే ముగిసినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో అధికారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.