26-07-2025 05:39:16 PM
జూలకంటి రంగారెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(CPI(M) State Secretariat Member Julakanti Ranga Reddy) విమర్శించారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో జరిగిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, 42 శాతం బిసి రిజర్వేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర శాసనసభ, మంత్రి వర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపారని గుర్తు చేశారు. బిల్లుపై గవర్నర్ సంతకం తర్వాత కేంద్రప్రభుత్వానికి పంపినా చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం దుర్మార్గం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను పంపితే వాటిని ఆమోదించకుండా సంవత్సరాల తరబడి సమయం పడుతుందని విమర్శించారు. ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని బిల్లులు తయారు చేసి పంపితే ఎందుకు ఆమోదించడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.స్థానిక సంస్థల ఎన్నికలు గడువు పూర్తయి రెండేండ్లు కావస్తున్నా కాలయాపన చేయడం మంచి పద్దతి కాదన్నారు. 42శాతం బిసి రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లి రిప్రెజెంటేషన్ చేయాలని కోరారు. సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రాంట్ చెల్లించకపోవడం వలన సమస్యలు పేరుకపోయాయని అన్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాలు మరియు మురికి కూపాలుగా మారాయని, ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక సంస్థలు పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. సోమవారం జరిగే రాష్ట్ర క్యాబినెట్‌లో ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, డి.మల్లేషం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీళ, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మినారాయణ, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.