calender_icon.png 27 July, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూతూమంత్రంగా వైద్యాధికారి విచారణ

26-07-2025 05:42:55 PM

19వ తేదీ సీసీ పుటేజీ మాయం..

ముందస్తు అప్రమత్తతతో విచారణ..

పెబ్బేరు: వనపర్తి జిల్లా(Wanaparthy District) పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో గల స్థానిక  రాఘవేంద్ర ఆసుపత్రిలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆలే శ్రీనివాసులు బృందం విచారణ జరిపింది. మండల పరిధిలోని పెంచుకలపాడు గ్రామానికి చెందిన కాటెపాగ రాజు వైద్యం వికటించి మృతి చెందిన సంఘటనపై ఆసుపత్రిని తనిఖీ చేసి విచారణ చేసారు. విచారణలో భాగంగా డాక్టర్ తంగెడంచు రాఘవేంద్ర రెడ్డిని పలు విషయాలపై ప్రశ్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న నర్సును కూడా ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, 19వ తేదీ రోజు సదరు మృతుడు వచ్చాడని, మెడ బాగంలో చిన్న పాటి వేడి గుల్ల కావటంతో నీడిల్ తో గుచ్చి చీము తొలగించానని తెలిపారు.

ఎటువంటి సర్జరీ చేయలేదని కావాలనే నాపై అభియోగాలు చేస్తున్నారని ఆరోపించారు. 19 తేదీ సీసీ పుటేజ్ పై అధికారి ప్రశ్నించగా సీసీ పుటేజీ చూయించారు. కానీ 19వతేదీ సీసీ పుటేజీ హార్డ్ డిస్క్ లో లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇట్టి విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సహాయ వైద్య అధికారి బి శ్రీనివాస్ ను విచారణ అధికారి గా నియమించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని విచారణ జరిపి వాస్తవాలను పూర్తి స్థాయి నివేదిక జిల్లా కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.