calender_icon.png 19 October, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న శ్రీ మహాశక్తి దేవాలయం

18-10-2025 08:56:42 PM

- నేడు ధన త్రయోదశి, రేపు నరక చతుర్దశి, దీపావళి పండుగ

- వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,(విజయక్రాంతి): దీపావళి పర్వదిన మహోత్సవానికి  కరీంనగర్లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయం శరవేగంగా ముస్తాబవుతుంది. శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల కొలువుదీరిన మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో దీపావళి పండుగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 19 నుండి 21 వరకు జరిగే దీపావళి పర్వదిన మహోత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రతతో, అంగరంగవైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్త భక్తులకు మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు.

అలాగే ఆలయ ప్రాంగణం ఆకట్టుకునే విద్యుద్దీపాల అలంకరణల వెలుగులతో విరజిమ్మేళ ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి పర్వదిన మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ధన త్రయోదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లకు నాణెంలతో పూజ, పుష్పాభిషేకం, రాత్రి 7.30 గంటల నుండి అమ్మవార్లకు మహాభిషేకం, మంగళ ద్రవ్యాభిషేకం,  సోమవారం నరక చతుర్దశి, దీపావళి పండుగ  సందర్భంగా ఉదయం  8 గంటలకు అమ్మవార్లకు మహాహారతి, 9 గంటలకు లక్ష్మి కుబేర హోమం పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీపావళి పర్వదిన మహోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.