calender_icon.png 29 August, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

28-08-2025 10:17:22 PM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం కలెక్టరేట్ లో డీఈఓ యాదయ్య, నాణ్యత సమన్వయకర్తలతో కలిసి ఎంఈఓలు, హెచ్ఎంలు, సంబంధిత అధికారులతో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించి, మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలలో విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరి గోడలు ఇతర పూర్తి సదుపాయాలు కల్పించాలని, ప్రతి విద్యార్థికి సరైన విద్యా వసతులు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత పాటించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అవసరమైన క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు అందించిన డైరీలో రోజువారీగా వివరాలతో నవీకరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

విద్యార్థుల ప్రగతి, ప్రతిభ ఆధారంగా పాఠశాలల పని తీరు అంచనా వేయవచ్చన్నారు. మండల విద్యాధికారులు వారి పరిధిలోని పాఠశాలలను సందర్శించాలని, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, పాఠశాల వ్యవస్థల నిర్వహణ అంశాలను పర్యవేక్షించాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి నూతన విధానాలు, ప్రత్యేక పథకాలు అమలు చేయడం ద్వారా అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించవచ్చన్నారుజ వచ్చే కొద్ది నెలలలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల చదువు పట్ల మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.