19-12-2025 12:02:39 AM
చెన్నై, డిసెంబర్ 18: ‘డీఎంకే ఒక దుష్ట శక్తి.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్వచ్ఛమైన శక్తి’ అని సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ వ్యాఖ్యానించారు. ఈరోడ్ జిల్లాలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీటిపారుదల, శాంతిభద్రతలు, ఉద్యోగాలు, రైతు సంక్షేమం, నీట్ పరీక్ష మినహాయింపు వంటి అంశాలపై స్టాలిన్ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
గత సెప్టెంబర్ 27న కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత తమిళనాడులో విజయ్ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ ఇదే. ‘నేను మళ్లీ చెబుతున్నా.. డీఎంకే ఒక దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. ఈ పోరాటం ఈ రెండింటి మధ్యే జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. డీఎంకేకు, సమస్యలకు ఫెవికాల్తో అంటించినంత సంబంధం ఉంది. వాటి ని వేరు చేయలేం అంటూ ఎద్దేవా చేశారు.
1300మంది పోలీసులతో భద్రత
కరూర్ విషాదం పునరావృతం కాకుండా ఈ సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 35,000 మంది హాజరవుతారని అంచనా వేసి, 1300 మందికి పైగా పోలీసులను మోహరించారు.