12-07-2025 01:41:50 AM
అధికారులను హెచ్చరించిన సిద్దిపేట కలెక్టర్
హుస్నాబాద్, జూలై 11: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి శుక్రవారం కోహెడ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా, వైద్య సిబ్బంది మెడికల్ ఆఫీసర్ అనుమతి లేకుండానే కేవలం సెలవు లేఖలు సమర్పించి విధులకు గైర్హాజరు కావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కీలక సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధుల వేళ నిర్లక్ష్యం తగదు
కోహెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి సెలవులో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా వైద్య సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. ఔట్పేషెంట్ వివరాలు, మందుల వివరాలను రోజూ ఆన్లైన్లో నమోదు చేయాలని, అవసరమైన పరీక్షలు చేసి మందులు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపైనా అసంతృప్తి వ్యక్తం చేసి, ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశించారు.
ఇతర అభివృద్ధి, పర్యటనల పర్యవేక్షణ
కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల నాణ్యతను పరిశీలించి లబ్ధిదారులను అభినందించారు. ఇల్లు కట్టుకోవడానికి సుముఖత లేని వారి స్థానంలో అర్హులకు కేటాయించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమిని పరిశీలించి, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ గార్డెన్ను, హెలిప్యాడ్ కోసం ఖాళీ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
శనిగరంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మికస్డ్ వెజిటబుల్ కర్రీ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, డీఈవోకు నివేదించాలని తహసీల్దార్ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి దేశభక్తిని, తెలుగు భాషా గొప్పదనాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట ఆర్టీవో రామ్మూర్తి, ఏడీ ల్యాండ్ సర్వే వినయ్ కుమార్, తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీడీవో కిష్టయ్య తదితరులున్నారు.