24-12-2025 01:23:54 AM
రంగారెడ్డి, డిసెంబర్ 23(విజయక్రాంతి):రైతుల అవసరాలకు తగిన రుణాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్ అన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను ఖరారు చేయడానికి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (District Level Technical Committee) సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను రైతుల అవసరాలకు తగిన విధంగా ఉండాలని, గత సంవత్సరం కంటే 25 శాతానికి పెంచాలని, ప్రత్యేకంగా వరి, పత్తి, మొక్కజొన్న మరియు కొన్ని నగదు పంటలకు పెంచాలని సూచించారు. జిల్లా అధికారులందరూ కమిటీకి తమ అభిప్రాయాలను తెలిపారు. రైతులకు ఫైనాన్సింగ్కు సంబంధించిన అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో సీఈఓ డీసీబీ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, నాబార్డు డిడిఎం, రంగారెడ్డి జిల్లా LౄM సుశీల్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా, హర్టీకల్చర్ అధికారి సురేష్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్దక శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.