calender_icon.png 20 May, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు

20-05-2025 02:23:45 AM

  1. ఏబీవీపీ కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్
  2. ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనలను టీఏఎఫ్‌ఆర్‌సీ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు పెంపు నిర్ణయాన్ని వ్యతిరేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని మాచెర్ల రాంబాబు తీవ్రంగా ఖండించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. పేద బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యను దూరం చేయడంలో భాగంగానే టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కు ఫీజుల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి లేదని, ఇంజినీరింగ్‌కు రూ.2లక్షలకుపైగా ఫీజులు పెంచితే పేద విద్యార్థులు ఏ విధంగా చెల్లిస్తారని నిలదీశారు.

బీ కేటగిరి సీట్ల విచ్చలవిడి అమ్మకానికి చెక్ పెట్టాలని, మెడికల్ తరహాలోనే మెరిట్ ర్యాంక్ ప్రతిపాదికన ఆన్‌లైన్‌లో అడ్మిషన్స్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫీజుల పెంపు ప్రతిపాదనలను టీఏఎఫ్‌ఆర్‌సీ వెనక్కి తీసుకోకపోతే రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధర్నాలో సిటీ సెక్రటరీ పృథ్వీతేజ, సీడబ్ల్యూసీ మెంబర్ ఝాన్సీ, విభాగ్ కన్వీనర్ శ్యామ్‌కిరణ్, రాష్ర్ట సంయుక్త కార్యదర్శులు రాజు, స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ ప్రశాంత్,  జిల్లా కన్వీనర్లు బాలు, అఖిల్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.