calender_icon.png 29 May, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలకు నూనె రాస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

25-05-2025 12:00:00 AM

జుట్టుకు నూనె రాసుకోవడం ఎప్పుడు పుట్టిందనే ప్రశ్నకు జవాబు వెతకడం కాస్త శ్రమతో కూడిందే. అయితే ఎలా మొదలైందనే విషయంలో మాత్రం పలు వాదనలున్నాయి. ప్రకృతిపై మనిషికి అవగాహన ఏర్పడిన తర్వాత ఇది మొదలైందని చెబుతుంటారు. అలా జుట్టుకు నూనె రాసుకోవడం భారతదేశంలో అనాదిగా వస్తోంది. ఇది తరతరాలుగా కొనసాగుతూ మన సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన అలవాటు. జుట్టుకు నూనె రాసుకోవడం వెనుక కేవలం సంరక్షణ, పోషణ మాత్రమే కాదు సాంస్కృతిక, సామాజిక ప్రాముఖ్యతా ఉన్నాయి. 

తల్లులు లేదా అమ్మమ్మలు, నానమ్మలు తమ పిల్లల జుట్టుకు నూనె పెడుతూ మసాజ్ చేయడం వల్ల వారి మధ్య దృఢమైన బంధం ఏర్పడుతుంది. పెళ్లి, పండుగలు వంటి శుభకార్యాల సమయంలోనూ నూనె రాసుకోవడం మనం చూస్తుంటాం. జుట్టుకు నూనె రాసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.

ప్రయోజనాలు

జుట్టుకు నూనె రాయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలపడి జుట్టు దృఢంగాగా ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగా మారటం, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నూనె రాయడం వల్ల జుట్టు మృదువుగా మారి మంచి మెరుపు సంతరించుకుంటుంది. జుట్టు పొడిబారడం, వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. 

తలకు నూనె పెట్టడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దానివల్ల జుట్టు వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. హెయిర్ ఆయిల్ జుట్టును తేమగా ఉంచుతుంది. జుట్టుకు నూనె విటమిన్లు, పోషకాలు అందించి బలంగా తయారు చేస్తుంది. తద్వారా వెంట్రుకలు తెగిపోవడం, చివర్లలో రెండుగా విడిపోవడం, హెయిర్ ఫాల్ వంటి వాటిని తగ్గిస్తుంది.

మనదేశంలో చాలామంది కొబ్బరి నూనె వాడుతున్నప్పటికీ రకరకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఆల్మండ్ ఆయిల్, అర్గాన్ ఆయిల్, ఆలివ్ నూనె, ఆమ్లా నూనె, మెంతి నూనె, నువ్వుల నూనె, లిన్సీడ్ నూనె, ఆవాల నూనె జుట్టు కోసం వాడుతున్నారు.

రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే తలపై చుండ్రు తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. 

రోజూ నూనె పెడితే?

దీనికి ఒక్కమాటలో సమాధానం చెప్పాలంటే అది వద్దు. జుట్టుకు ఆయిల్ మేలు చేసినప్పటికీ అదే పనిగా ప్రతిరోజూ ఆయిల్ పెట్టడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోజూ నూనె రాసుకోవడం వల్ల స్కాల్ఫ్ జిడ్డుగగా మారడం, వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోవడం, జుట్టు విరగడం వంటివి జరుగుతాయంటున్నారు.

అందుకే మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ జుట్టు బాగా పొడిగా ఉంటే తరచూ ఆయిల్ అప్లు చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చంటున్నారు.