24-05-2025 12:17:10 AM
వనపర్తి, మే 23 ( విజయక్రాంతి) : వైద్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ లు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆసుపత్రి సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ లతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వాసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ లు అందుబాటులో లేకపోతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించలేమనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇకనుండి బయోమెట్రిక్ తో పాటు మ్యానువల్ హాజరు రిజిస్టర్ ప్రతినెల తన వద్దకు పంపించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి, మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
వైద్య శాఖలో కొత్తగా నియామకం జరిగిన తర్వాత ఎంతమంది వైద్య సిబ్బంది హాజరయ్యారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల 400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా చూడాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్యం పై చర్చిస్తూ ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చినందున జిల్లాలో కంటి పొరలతో ఇబ్బందులు పడుతున్న వారికి శస్త్ర చికిత్సల ద్వారా వైద్యం చేయాలని ఆదేశించారు.
మాత శిశు వైద్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను సాధ్యమైనంతవరకు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ రంగారావు డిపార్ట్మెంటల్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.