24-05-2025 12:18:30 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, మే 23 : పరిసరాల్లో దోమలు ప్రబలకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం వనపర్తి పట్టణంలోని నాగవరం 5,10వ వార్డులో మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించిన డ్రై డే - ఫ్రైడే కార్యక్రమాలను పరిశీలించారు.
వర్షపు నీరు కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పడేసిన సీసా మూతలలో నిలిచిన నీటిలో డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టీ పెరుగుతాయని అందువల్ల ఇళ్ల పై కప్పు, పరిసరాల్లో ఎక్కడా నిలువ నీరు ఉండకుండా పాటు శుక్రవారం ప్రజలు వారి ఇళ్లలో నీరు పారబోసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇళ్లల్లో ఎవరికైనా జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు.
మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతుందని, దోమల వల్ల వచ్చే వ్యాధుల పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా ఇల్లిల్లు తిరుగుతూ పారిశుధ్యాన్ని పరిశీలించారు. దోమల నివారకు తీసుకోవాల్సిన చర్యల పై ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించారా అని ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి డాక్టర్ పరిమళ ఆశ వర్కర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు