calender_icon.png 2 May, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్లు కనిపించే దేవుళ్లు

25-04-2025 01:55:28 AM

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్ల , ఏప్రిల్ 24 : సమాజంలో వైద్య వృత్తికి ఎంతో గౌరవం ఉంటుందని, డాక్టర్లు కనిపించే దేవుళ్లని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చేవెళ్ల మున్సిపల్లోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేషన్ డే -2019 బ్యాచ్ కార్యక్రమాన్ని మల్కాపూర్ వార్డులోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శాంత బయో టెక్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, డబ్ల్యూహెచ్వో ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని అన్నారు.

గతంలో ఏదైనా పెద్ద జబ్బు వస్తే ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లేవారని, ఇప్పుడు మన దేశంలో కూడా అధునాతన పరికరాలతో, అంతర్జాతీయ స్థాయి దవాఖానలు ఉన్నాయని తెలిపారు. మన హైదరాబాద్లో కూడా వరల్డ్ క్లాస్ దవాఖానలు ఉన్నాయని, వేరే దేశాల నుంచి చికిత్స కోసం మన దగ్గరకు వస్తున్నారని గుర్తు చేశారు.

మిగిలిన రంగాల కంటే భిన్నమైనది వైద్య వృత్తి అని, ఇందులో ఆదాయం కంటే సేవాగుణం ఎక్కువగా ఉండాలని సూచించారు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

డాక్టర్లు దైవంతో సమానం..

మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వైద్యులు దైవంతో సమానమని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. దేవుడు జన్మనిస్తే వైద్యులు ప్రాణాలు కాపాడే గొప్ప వ్యక్తులన్నారు. 

వైద్య వృత్తిలో పీజీలు, పీహెచ్డీలు చేసి మరింత నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేందర్రెడ్డి కళాశాల డీన్ పీవీ సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ జోయారాణి, కళాశాల సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, పట్టాలు అందుకున్న 132 మంది విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.