13-09-2025 04:59:48 PM
హాని చేయవద్దని, చంపకూడదు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): దేశంలో ఇటీవల కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలలో అప్రమత్తతతో పాటు కుక్కలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. శనివారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ పార్కులో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద కుక్కల దత్తత కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. ఒకవైపు కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ ఇస్తూనే, కుక్కలను కాపాడే ప్రయత్నం చేయాలని, ఎవరూ కుక్కలకు హాని చేయవద్దని, ఎట్టి పరిస్థితిలో చంపకూడదని అన్నారు. కుక్క కాట్లపై ఇటీవలి సుప్రీం కోర్టు స్పందనను ఆయా ప్రస్తావించారు. నల్గొండ జిల్లాలో సుమారు 40 వేల కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తున్నదని,అయితే అమెరికా లాంటి దేశాల్లో కుక్కలను సైతం మనుషుల్లాగా చూస్తున్నారని, కుక్కలకు కూడా ఎంతో విలువ ఇస్తారని ,ప్రత్యేకించి కుక్కలకు ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నాయని తెలిపారు.కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారిని ఆయన అభినందించారు.
ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో పూర్తి సహకారం ఇస్తామని, ప్రజలు కుక్కల బారిన పడకుండా ఉండేందుకుగాను కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన జిల్లా యంత్రాంగానికి సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వీధి కుక్కలు కోతులు, పిల్లుల సంఖ్య పెరిగిపోయి వాటి దాడులు ఎక్కువ అవుతున్నాయని, వాటిని నివారించేందుకు కుక్కల దత్తత వ్యాక్సినేషన్స్, స్టరీలైజేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో 92000 గృహాలు ఉండగా, సుమారు 5000 కుక్కలు ఉన్నాయని ఒక్కొక్కరుఒక్కో కుక్కను దత్తత తీసుకుంటే కుక్కల బెడద ఉండదని తెలిపారు. శనివారం నిర్వహించిన కుక్కల దత్తత కార్యక్రమంలో 49 కుక్కలను దత్తత ఇచ్చినట్లు ఆమె తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, దేవరకొండ ఏసీపీ మౌనిక, అడిషనల్ రమేష్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి , పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు .