13-09-2025 06:55:26 PM
ప్రారంభానికి నోచుకోని స్ట్రీట్ వెండర్ జోన్
పట్టించుకోని అధికారులు పాలకులు
రోడ్లపై వ్యాపారాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కల్వకుర్తి: అభివృద్ధి పనులకు నిధులు లేక అనేకచోట్ల ఆటంకాలు ఏర్పడుతుంటే నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కల్వకుర్తి మున్సిపాలిటీలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిపాలన సాగుతోంది. అభివృద్ధి పనుల పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసినా వాటి ఫలితాలు మాత్రం ప్రజలకు అందడం లేదు. రోజురోజుకు పట్టణ జనాభా పెరుగుతుండడం అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఉన్న వాటిపై వీధి విక్రయదారులు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వీధివిక్రయదారులకు దుకాణ సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు నిధులు కేటాయించారు. రోడ్లపై వ్యాపారాలు చేయకుండా ఉండేందుకు స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. గుర్తింపు పొందిన చిరు వ్యాపారులు సముదాయంలోనే వ్యాపారాలు చేసుకునేలా స్థలాలు కేటాయించాల్సి ఉండగా అది నేటికీ అమల్లోకి రావడం లేదు. నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వినియోగంలోకి తేకపోవడంతో ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి.
రూ, 50 లక్షల తో సముదాయం నిర్మాణం.!
కల్వకుర్తి మున్సిపాలిటీలో నిధులు సమృద్ధిగా ఉండడంతో అధికారులు, గత పాలకవర్గ సభ్యులు నిర్ణయాలు తీసుకొని నిర్మాణాలు చేపట్టినప్పటికీ వాటి ఫలితాలు మాత్రం ఎవరికి అందడం లేదు. కల్వకుర్తి పట్టణంలో వీధివిక్రయదారుల కోసం రెండేళ్ల క్రితం రూ,50 లక్షలతో స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మించారు. ఇప్పటివరకు వాటిని వినియోగంలోకి తేకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. సమీపంలోనే బెల్టు దుకాణాలు ఉండటంతో మందుబాబులకు అడ్డగా మారింది. రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.