calender_icon.png 11 October, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా బోధనపై అలసత్వం వద్దు

09-10-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): విద్యా బోధనపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోనిగిరిజన ఆశ్రమ పాఠశాలు (బాలికలు, బాలురు), కాగజనగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు (బాలికలు,బాలురు) లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం అంశాలను పరిశీలించి సం బంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు.

ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు తమ పిరియడ్ సమయానికి స్టాఫ్ రూమ్ లో కాలక్షేపం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమయపాలనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.