09-09-2025 12:01:40 AM
-మొయినాబాద్ పరిధిలో 19 వాగులు, నాలాలు ఆక్రమణ
-పలు చోట్ల కబ్జా చేసి వాల్స్, కల్వర్టులు కట్టేసిన వైనం
-స్థానికుల ఫిర్యాదు మేరకు సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు
-ఇప్పటికే తహసీల్దార్ కు చేరిన రిపోర్ట్.. తర్వలోనే చర్యలు
చేవెళ్ల, సెప్టెంబర్ 8: మొయినాబాద్ మండల పరిధిలో ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు శిఖం, గైరాన్, పొరంపోగు, సర్కారు భూము లే కాదు.. వాగులు, నాలాలను కూడా వదలట్లేదు. దాదాపు 10 మీటర్లకు పైగా ఉన్న వాగులను కబ్జా చేసి 2 మీటర్లకు కుదిస్తున్నారు. ఇరువైలా కాంపౌండ్ వాల్స్ ఏర్పా టు చేయడంతో పాటు కొన్నిచోట్ల వాగును పూర్తిగా ఆక్రమించుకొని వాటర్ వెళ్లేందుకు కల్వర్టులు కట్టేస్తున్నారు.
ఇంకొన్ని చోట్ల వాగును మరో వైపు మళ్లిస్తున్నారు. ఈ కబ్జాలపై ఆయా గ్రామాల ప్రజ ల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి 19 వాగులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే తహసీల్దార్కు రిపోర్టు అందజేశారు. ఇదివరకే పదుల సంఖ్యలో ప్రభుత్వ భూముల కబ్జా లు అడ్డుకున్న ఆయన త్వరలోనే వాగుల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
చర్యల కోసం తహసీల్దార్కు లేఖలు
స్థానికుల ఫిర్యాదు మేరకు ఫీల్ విజిట్ చేసిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ , వర్క్ ఇన్స్పెక్టర్తో కలిసి మొయినాబాద్ మండల పరిధిలో 2023 నుంచి ఇప్పటి వరకు 19 వాగులు , వాటి బఫర్ జోన్లు కబ్జా చేయడంతో పాటు కొన్ని వాగుల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. సురంగల్, కనకమామిడి, నజీబ్ నగర్ పరిధి నుంచి పెద్ద చెరువుకు వెళ్లే వాగు, సురంగల్ పరిధిలోని ఎర్రగుంట వాగు, బాకారం జాగీర్లోని ఎర్రకుంట ట్యాంకు ఫీడర్, కేతిరెడ్డి పల్లి పరిధిలోని కనుగుల కుంట, చిన్నమంగళారం, కనమమామిడి, తోలకట్ట, చిల్కూరు, నక్కలపల్లి, అప్పారెడ్డి గూడ, రెడ్డి పల్లి, అమ్డాపూర్, ఎత్బార్ పల్లి, కుద్బీద్దీన్ గూడ పరిధిలో స్థానిక వాగులు, నాలాల పరిధిలో ఆక్రమణలు ఉన్నట్లే తేల్చారు. వీటిపై డీమార్కేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహసీల్దార్కు 2023లో ఒక సారి, 2024లో ఒకసారి, 2025లో రెండు సార్లు లేఖలు రాశారు. గ్రామ నక్షల ఆధారంగా వాగులను గుర్తించేందుకు మండల సర్వేయర్ను నియమించి, నీటిపారుదల అధికారుల సమక్షంలో సర్వే చేసి ఇరిగేషన్ యాక్ట్1357ఎఫ్, ఎన్క్రోచ్మెంట్ యాక్ట్1900 ప్రకారం ఆక్రమణలను తొలగించాలని అందులో కోరారు.
తోల్కట్టలో 2 మీటర్లకు తగ్గిన వాగు
తోల్కట్ట గ్రామంలోని సర్వే నెం. 137 గుండా వెళ్లే 10 మీటర్ల వెడల్పున్న వాగును కబ్జాదారులు 2 మీటర్లకు కుదించారు. బీజాపూర్ హైవే దగ్గర మొదలయ్యే ఈ వాగు స్వామి రామనంద తీర్థ సోషియో ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుండా సర్వే నెం. 136, 124, 123లోకి ప్రవహిస్తుంది. అయితే, ఇన్స్టిట్యూట్ వాళ్లు వాగు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి దానిని పక్కకు మళ్లించారు. ఈ క్రమంలో వాగును రెండు మీటర్లకు తగ్గించారు. ఇది కిందికి దాదాపు కి.మీ. వెళ్లాక దాదాపు 15 మీటర్ల వెడల్పుతో చెక్ డ్యామ్ ఉంటుంది. కానీ, ఇది దాటిన తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి వాగును ఆక్రమించి నీటి ప్రవాహం కోసం కేవలం 2 మీటర్ల వెడల్పుతో కల్వర్టు నిర్మించాడు. ఈ కల్వర్టు దాటిన తర్వాత తన పొలంలో నీరు కిందికి వెళ్లేలా సిమెంట్ కాల్వను కూడా ఏర్పాటు చేశాడు. ఇలా దాదాపు కిలో మీటర్ పాటు వాగును 2 మీటర్లకు కుదించడంపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఫీల్ సర్వే నిర్వహించి తహసీల్దార్కు నివేదిక సమర్పించారు. అదే విధంగా, స్థానికులు తహసీ ల్దార్కు కూడా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్వే చేసి చర్యలు తీసుకుంటం
వాగుల ఆక్రమణలకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుంచి లేఖ అందింది. దాని ఆధారంగా ముందు సర్వేయర్ తో , ఇరిగేషన్ అధికారులు, స్థానికుల సమక్షంలో సర్వే చేసి సరిహద్దులు గుర్తిస్తాం. తర్వాత కబ్జాలపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. చెరువులు, వాగులు, ప్రభుత్వ భూములు ఆక్రమించే వారి ఎంతటి వారైనా వెనకడుగు వేసేది లేదు.
- గౌతమ్ కుమార్, తహసీల్దార్
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
పంటలు, చెరువులకు ఆధారమైన వాగులను కబ్జా చేయడం దారుణం. తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 137లో 10 మీటర్ల వెడల్పు ఉండే వాగును రామనంద తీర్థ ఇనిస్టిట్యూట్ వాళ్లు దారి మళ్లించి 2 మీటర్లు చేసిన్రు. దీంతో కింద కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. సర్వే చేసి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను కోరుతున్నం.
- భానూరి శివశంకర్ గౌడ్, కాంగ్రెస్ మండల నాయకుడు