calender_icon.png 27 July, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ అందరివాడు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

26-07-2025 08:36:51 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): దేశ ప్రజలందరూ గర్వించదగ్గ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అని, అంబేద్కర్ అందరివాడని, ఆయన ఒక కులానికో వర్గానికో పరిమితం కాదని, మహా నాయకుడని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రవిచంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులతో కలిసి శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ... మా స్వగ్రామం ఇనుగుర్తిలో నెలకొల్పిన మహనీయులు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గత నెల 3వతేదీన, ఇప్పుడిక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలుగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడైన అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించి, దానికి భారతరత్న అంబేద్కర్ పేరు పెట్టారని, పార్లమెంట్ నూతన భవనానికి కూడా అదే నామకరణం చేయాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయానికి సమీపాన 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ నెలకొల్పి అంబేద్కర్ పట్ల తనకున్న గౌరవభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట 20లక్షల చొప్పున ఉచితంగా అందజేసి ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఎంపీ వద్దిరాజు వివరించారు. జేడ్పీ మాజీ ఛైర్ పర్సన్ ఆంగోతు బిందు, విగ్రహదాత గోపీ, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తాతా గణేష్ పాల్గొన్నారు.