calender_icon.png 29 June, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ సమస్యలు రాకుండా కులగణన

28-06-2025 09:03:08 PM

పూర్తయితే బీసీలకు ప్రయోజనం

బీసీల హక్కులను కాలరాసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కేంద్రంలో గత 64 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కులగణనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయ సమస్యలు రాకుండా కులగణనను చేపట్టనుండడం కీలకమైన చర్య అని ఓబిసి మోర్చా  జాతీయ అధ్యక్షులు   రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్‌ అన్నారు. ‘‘కులగణన, ఓబీసీల భవిష్యత్‌ నిర్మాణం, సామాజిక న్యాయం’’అనే అంశంపై బీసీ సంఘాలతో  రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం జిల్లా కేంద్రంలోని స్టే ఇన్  హోటల్లో  జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. 1931 అనంతరం దేశంలో కులగణన జరగలేదన్నారు. 1951లో జరగాల్సిన కులగణనని అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని విమర్శించారు. ఇలా బీసీల హక్కుల ను అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు.

రాష్ట్రంలో 12 శాతం ఉన్న ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి బీసీల హక్కులను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభు త్వం కాలరాసిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లింలకు తాము వ్యతిరేకం కాదన్నారు. బీసీల కోసం కులగణన అవసరమని నొక్కి చెబుతూ వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు, నిపుణుల సలహాలు, సూచనలతో నివేదికను తయారుచేసి కేంద్రంలోని సామాజిక, న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఓ బి సి  మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  గంధ మల్ల ఆనంద్ గౌడ్,  బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ తో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు, నిపుణులు పాల్గొన్నారు