12-07-2025 08:04:52 PM
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు మండలంలోని నాగారం గ్రామ రైతులకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్(BJP District General Secretary Durgam Ashok) అండగా నిలిచారు. గ్రామంలోని రైతులందరి పంట భూములు సుమారు 1200 ఎకరాలు గోదావరి ఒడ్డు నుండి గ్రామం వరకు ఉండగా పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం ప్రభుత్వ అధికారులు చేపట్టకపోవడంతో రైతులు చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం పనులు చేపట్టగా విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదివారం రైతులకు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులందరి పోలాలకు ఒకే రోడ్డు ఉండగా ప్రస్తుత వర్షాకాలంలో బురద మయం ఆయి నడిచేందుకు వీలు లేకుండా పోతుందని, కనీసం పొలాల్లో చల్లే మందు బస్తాలను తీసు కెళ్లేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామం నుండి గోదావరి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులు తీరుస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రెండు సార్లు హామీ ఇచ్చిన ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన మండి పడ్డారు. ఎమ్మెల్యే బూటకం హామీలతో మోసపోయామని గ్రహించిన రైతులు రోడ్డు నిర్మాణం కోసం చందాలు వసూలు చేసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పు కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల పార్టీ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, నాయకులు సాయి, అన్నల మల్లేష్, సత్యం, శీను, ఆలం బాపు, కుడుదల రాజన్న, దుర్గం రాజబాబు, మంత్రి రామయ్య లు పాల్గొన్నారు.