22-09-2025 05:51:25 PM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): దుర్గ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయనున్న అమ్మవార్ల ఊరేగింపు మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, మేళ తాళాల తో అమ్మవారి విగ్రహాలను చక్కగా అలంకరించిన వాహనాలపై ఉంచి పట్టణ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. నవదుర్గ సేవా సమితి, సువర్ణ దుర్గ సేవా సమితి, వనదుర్గ సేవా సమితి, విజయదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు, వివిధ వేషధారణలతో నృత్యాలతో, భజన కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారిని ఊరేగించి వివిధ దేవాలయాల్లో ప్రతిష్టించారు. పది రోజులపాటు అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.