calender_icon.png 17 December, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా విధులు నిర్వహించాలి

17-12-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్                                  

సూర్యాపేట, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికల సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. జిల్లాలో డిసెంబర్ 17 న నిర్వహించే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల పరిధిలోని 146 గ్రామపంచాయతీ సర్పంచ్ లకు,1318 వార్డు సభ్యులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా 22 సర్పంచులు ,257  వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయన్నారు.  దీంతో నేడు 124 గ్రామ పంచాయతీలకు, 1061 వార్డు సభ్యులకు 1176 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు పోలింగ్ సామాగ్రి అంతా తీసుకున్నారో లేరో మరోసారి పరిశీలించుకోవాలన్నారు.

కొన్నిచోట్ల సర్పంచులు ఏకగ్రీవమైన చోట వార్డులకు ఎన్నిక జరగుతుందని, వార్డు సభ్యులు ఏకగ్రీవమైన చోట సర్పంచుకు ఎన్నిక ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్లు తీసుకునే విషయంలో ఆర్వో  అలాగే ఎన్నికల సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పోలీస్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పంచాయతీ కార్యదర్శి అలాగే ఎంపీడీవోకి సమాచారం అందిస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లకు ఎదురుగా వారి యొక్క గుర్తులు జాగ్రత్తగా అతికించి పోలింగ్ కేంద్రం ముందు ప్రదర్శించాలన్నారు.

పోలింగ్ ఉదయం 7:00 గంటల నుండి ఈ మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని ఒకవేళ మధ్యాహ్నం 1:00 గంట కన్నా ముందే ఏదైనా ఒక పోలింగ్ కేంద్రంలో 100% పోలింగ్  నమోదైనప్పటికీ మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ బ్యాలెట్ బాక్స్ సీల్ చేయరాదని, ఫారంలు నింపరాదని ఒకవేళ ముందే పూర్తి అయిందని బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి, ఫారంలు నింపితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మధ్యాహ్నం 1:00 గంట తర్వాత పోలింగ్ కేంద్ర ప్రాంగణంలో ఎవరైనా ఓటర్లు  ఉంటే వారికి చివరి నుండి వరుస క్రమంలో టోకెన్లు జారీ చేసి అందరు ఓటేసిన తర్వాతే పోలింగ్ ముగించాలన్నారు. పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం వేరువేరు చోట్ల ఏర్పాటు చేస్తే బ్యాలెట్ బాక్స్ లను పోలీస్ భద్రతతో  వాహనం ద్వారా తరలించాలని ఆదేశించారు. 

మధ్యాహ్నం 2:00  గంటల నుండి లెక్కింపు ప్రక్రియ  నిర్వహించేటప్పుడు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అప్పటినుండి ఎన్నిక ఫలితాలు పూర్తయ్యేంతవరకు అలాగే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి అయ్యేవరకు వీడియో గ్రఫీ చేయాలన్నారు.సందేహం ఉన్న ఓట్లపై నిర్ణయం వచ్చిన తర్వాతే లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని సర్పంచ్ ఓట్లు లెక్కింపు పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేలా మొదటి నోటీస్ ఇవ్వాలని,

అప్పుడు సాధ్యం కాకపొతే తదుపరి రెండవ నోటీస్ జారీ చేసి  డిసెంబర్ 18 న కోరం ఏర్పడితే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని  రెండోసారి కూడా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించుటకు సాధ్యం కాకపోతే డిసెంబర్ 18 న మధ్యాహ్నం మూడవ నోటిస్ జారీ చేసి కోరం లేకుండానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించుకోవచ్చు అని  తెలిపారు.

ఎక్కువ ఓట్లు ఉన్నచోట ఆర్వో లకి సహాయం చేయుట కొరకు  ఏఆర్వోలను నియమించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రెండు, మూడు టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గానీ,రీకౌటింగ్ చేసేటప్పుడు గానీ  జిల్లా ఎన్నికల విభాగం అనుమతితో ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని అలాగే రికౌంటింగ్ చేయాలని సూచించారు. రీకౌంటింగ్ చేసేటప్పుడు రివేరిఫికేషన్ చేయరాదని కేవలం ఓట్లు మాత్రమే లెక్కించాలని సూచించారు..

ఎన్నికల నిర్వహించే గ్రామాలలో శాంతి భద్రత విషయంలో,పోలింగ్ విషయంలో ఏమైనా గందరగోళ పరిస్థితి ఏర్పడినా, అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే పై అధికారులు తెలియజేయాలని సూచించారు. గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు.ప్రతి ఒక్కరు ఓటు వేయటం బాధ్యతగా భావించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు.

పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణా సంచాలు కాల్చటం లాంటివి చేయకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా అభ్యర్థులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈయాన వెంట పలువురు అధికారులు ఉన్నారు.