05-08-2025 05:37:48 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టితో తయారుచేసిన విగ్రహాలనే ప్రోత్సహించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, డి.తిరుపతి కోరారు. హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఓపి)తో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కు హాని జరుగుతుందని, రసాయనాల వలన అవి తొందరగా నీటిలో కరగని, ఆక్సిజన్ స్థాయి తగ్గి నీటిలో జీవించే జీవరాశులకు హాని కలుగుతుందని నీరు కలుషితం అవుతుందని, చేపలు ఇతర జలచరాలు బతకడానికి ఇబ్బంది అవుతుంది.
నేల స్వభావం దెబ్బతింటుంది. పిఓపి పొడి గాలిలో కలవడం వలన శ్వాస కోస సమస్యలు, చర్మవ్యాధులు వస్తాయని రాజస్థాన్ రాష్ట్రంలో తయారు అయిన పిఓపి కెమికల్స్ వలన భూమి, నీరు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, విగ్రహాల తయారీలో వాటిని నిషేధించాలని కోరారు. గతంలో 2021 వ, సంవత్సరంలో హైకోర్టు పిఓపి విగ్రహాలు వాడొద్దని తీర్పు ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారుచేసిన విగ్రహాలనే వాడాలని, పర్యావరణ శాఖ, గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు.