19-11-2025 12:18:31 AM
ఇమ్మడి రవికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల లావాదేవీలు గుర్తింపు
బెట్టింగ్ యాప్‌ల డబ్బుతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో ఇళ్లు కొనుగోలు
అరెస్ట్ సమయంలో గంటన్నర పాటు తలుపులు తీయకుండా మొబైల్, టెలిగ్రామ్ డేటా తొలగింపు!
నిందితుడిని 5 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు
పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా నిందితుడు ఇమ్మడి రవి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు, పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఈ మేరకు కేసు వివరాలు అందించాలని కోరుతూ హైదరాబాద్ సీపీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇమ్మడి రవిని విచారిస్తున్నకొద్దీ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్ యాప్‌లైన వన్ ఎక్స్ బెట్, వన్ విన్ వంటి వాటి ప్రకటనలు ప్రదర్శిస్తూ రవి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు తేలింది. అతనికి చెందిన కేవలం నాలుగు బ్యాంకు ఖాతాల్లోనే రూ.20 కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.
సినిమాల పైరసీ ద్వారా నెలకు రూ.11 లక్షల వరకు సంపాదించాడని, బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో ఇళ్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ, ప్రతి రెండు నెలలకో దేశం చొప్పున యూరోపియన్ దేశాలు తిరిగేవాడని విచారణలో అంగీకరించాడు.
పోలీసులు ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాల్లోని రూ.3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తులో రవికి చెందిన ఒక క్రిప్టో వాలెట్ నుంచి అతని ఎన్నారై ఖాతాకు నెలకు రూ.15 లక్షలు బదిలీ అయినట్లు తేలింది. ఈ అంతర్జాతీయ లావాదేవీలు, అక్రమ నగదు బదిలీలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.
అరెస్ట్ సమయంలో డేటా ధ్వంసం
కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో ఉన్న రవిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు.. వెంటనే లొంగిపోలేదని, గంటన్నర పాటు అపార్ట్‌మెంట్ తలుపులు తెరవకుండా లోపలే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతో తన టెలిగ్రామ్ డేటాను, మొబైల్ డేటాను పూర్తిగా క్లియర్ చేశాడని వెల్లడించారు. ల్యాప్‌టాప్‌ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో దాచిపెట్టగా, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు, నిందితుడు ఇమ్మడి రవిని 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం నేటికి వాయిదా వేసింది. కస్టడీకి అప్పగిస్తే, అతని అంతర్జాతీయ నెట్‌వర్క్, మిగిలిన నిందితుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.