29-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్, డిసెంబర్ 28(విజయక్రాంతి): చదువు జీవితాన్ని మార్చుతుందని విద్యార్థులు బాగా కష్టపడి చదివి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర ఎస్సి,ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వేముల గ్రామంలో అత్యాచారానికి గురై మరణించిన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి ఆర్‌అండ్ బి అతిథి గృహం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పి డి.జానకి లతో కలిసి చర్చించారు. అనంతరం మహబూబ్ నగర్ తిరుమల హిల్స్ లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించారు.
డిగ్రీ రెండవ,మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో సమావేశమై వారితో మాట్లాడారు. బోధన,భోజనం,వసతులు,ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమి లేవని విద్యార్థిని లు చెప్పారు. రాష్ట్ర ఎస్. సి.,ఎస్.టి.కమిషన్ చైర్మన్ గా జిల్లాకు రావడం మూడవ సారి అన్నారు. ప్రశ్నించి నప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని భారత రత్న అంబేద్కర్ అన్నారని,విద్యార్థిని లు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు రావాలని అన్నారు.
విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, చదువుతో నే జీవితం, భవిష్యత్ అని విద్యార్థిని లు బాగా కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల ఆశయం నిలబెట్టాలని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కని సాకారం చేసుకోవాలని,తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకొని లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానం లో నిలవాలని కోరారు. ప్రభుత్వ కళాశాల లు,వసతి గృహాల్లో చదివి ప్రభుత్వ అధికారులుగా ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులను ఉదాహరణగా పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ,ఝాన్సీ లక్ష్మీ బాయి, ఇందిరా గాంధీ,సావిత్రి బాయి పూలే లాంటి మహిళలను స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్ వాసంతి పిళ్ళై మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థిని ల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు,ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు,గత సంవత్సరం 98 శాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు.వృత్తి నైపుణ్య,బ్యాంకింగ్,కానిస్టేబుల్ తదితర పోస్టులకు శిక్షణ నిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థినిలతో కలిసిభోజనం చేశారు. ఈ కార్యక్రమం లో ఆర్.డి.ఓ నవీన్,డి.ఎస్.పి వెంకటేశ్వర్లు,జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్ధన్,సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సుదర్శన్,ఆర్.సి.ఓ కళ్యాణి,డి.పి.ఆర్.ఓ శ్రీనివాస్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వాసంతి,పిళ్ళై,తహశీల్దార్ ఘన్సీరాంనాయక్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.