calender_icon.png 31 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలి

31-12-2025 12:46:23 AM

కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి, డిసెంబర్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం నియోజక వర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లోని కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో కొనసాగు తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లోని వంటశాల, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని పాఠశాలలలో తాగునీరు, విద్యుత్, వంటశాల, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు ఏర్పాటు చేశామన్నారు.

నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్య బోధన అందిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టులో పాఠ్యాంశాలు బోధించి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. బెల్లంపల్లిలోని రాంనగర్ ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నెన్నెల మండలంలోని చిత్తాపూర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్డుల వారీగా ఓటరు జాబితా వేగవంతం చేయాలి 

-నస్పూర్, డిసెంబర్ 30 : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో గల వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ వలియత్ అలీలతో కలిసి కలెక్టరేట్ ఏఓ పిన్న రాజేశ్వర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని, నివాస ప్రాంతాలకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రాంతాలను గుర్తించాలని, పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించి ఉండకుండా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. 2026, జనవరి 1న పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితా తయారు చేసి, మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.