31-12-2025 12:45:04 AM
ఎంపీ గొడం నగేష్
కుమ్రం ఆసిఫాబాద్,డిసెంబర్ 30(విజయ క్రాంతి): జంగుబాయి దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కెరమెరి మండలం కోటపరంధోలి గ్రామంలో నిర్వహించిన జంగుబాయి జాతరలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి, మహారాష్ట్ర లోని యావత్ మాల్ నియోజకవర్గ శాసనసభ్యులు తొడసం రాజు లతో కలిసి ఆలయ క్షేత్రాన్ని సందర్శించి జంగుబాయి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ పవిత్రమైన పుష్య మాసంలో జంగుబాయి క్షేత్రంలో నిర్వహిస్తున్న జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, తదనగుణంగా క్షేత్రంలో జాతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జంగుబాయి దేవతను భక్తితో కొలుస్తారని, ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా జంగుబాయి దేవత కొలువై ఉందని తెలిపారు.
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, భవిష్యత్తు తరాలకు అందించాలని, వచ్చే రోజులలో జంగుబాయి క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రహదారి సౌకర్యం, ఆలయ క్షేత్రం చుట్టూ ప్రహరీ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్రాగునీటి వసతి కల్పిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జంగు భాయ్ ఉత్సవాలకు ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దర్శనానికి వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, రహదారి, ప్రహరీ నిర్మాణం, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఆసిఫాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన జంగుబాయి దేవస్థానం అభివృద్ధికి తెలిపారు.
మహారాష్ట్రలోని యవత్ మాల్ శాసనసభ్యులు మాట్లాడుతూ జంగుబాయి దేవస్థానం అభివృద్ధికి ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ శ్యామ్ రావు, అధ్యక్షులు కొడప జాకు, ఆసిఫాబాద్ రాజస్వ మండలాధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.